వడదెబ్బపై అప్రమత్తత అవసరం : కలెక్టర్‌

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

        అనంతపురం అర్బన్‌ : జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మినీకాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రజలు ఎండ తీవ్రత వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు ప్రస్తుత వేసవి కాలంలో ఎండల్లో బయట తిరగరాదన్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు ఇంటికే పరిమితం కావాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పట్టణ కార్యాలయాల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌లను ఉంచాలన్నారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరం అయినన్ని అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వడదెబ్బ చికిత్సలకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవాలన్నారు. వేసవి ముగిసే వరకు అన్ని గ్రామాలు, పట్టణాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎండవేడిమి, వడదెబ్బపై ప్రజలకు అవగాహన కార్యక్రమలను నిర్వహించాలన్నారు. ఉపాధి కూలీలకు తాగునీటి సౌకర్యం, నీడ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఒ విజరు కుమార్‌, డిఎంహెచ్‌ఒ ఎస్‌వి.కృష్ణారెడ్డి, డిసిహెచ్‌ఒ తిపేంద్ర నాయక్‌, డ్వామా పీడీ విజయ ప్రసాద్‌, విద్యాశాఖ ఏడీ నాగరాజు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ మల్లికార్జున, ఐసిడిఎస్‌ పీడీ లక్ష్మీకుమారి పాల్గొన్నారు.

➡️