కదిరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం : చంద్రబాబు

కదిరి రోడ్‌షోలో ప్రసంగిస్తున్న చంద్రబాబు నాయుడు

          కదిరి టౌన్‌ : టిడిపి, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే కదిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హామీనిచ్చారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కదిరికి విచ్చేసిన ఆయన నియోజకవర్గం అభివృద్ధికి పలు హామీలు గుప్పించారు. గురువారం సాయంత్రం కదిరి పట్టణం ఎస్‌టిఎస్‌ఎన్‌ డిగ్రీ ప్రభుత్వ కళాశాల మైదానంకు సాయంత్రం 5-40గంటలకు చేరుకున్నారు. హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థి బికె.పార్థసారథి, కదిరి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌లు పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ముస్లిం మైనారిటీలు ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందులో చంద్రబాబు పాల్గొని మత పెద్దలు మైనార్టీలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ నుంచి బయల్దేరి కాలేజ్‌ సర్కిల్‌, అంబేద్కర్‌ సర్కిల్‌ మీదుగా రోడ్‌షోగా జ్యోతిరావు పూలే వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలా దగా చేశారన్నారు. వైసీపీ పాలనలో ఏ ఒక్కరూ స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్‌ వంటి మాదక ద్రవ్యాలకు రాష్ట్రాన్ని కేంద్రం బిందువుగా మార్చేసి యువతను డ్రగ్స్‌కు అలవాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి రాగానే రాయలసీమలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని భరోసా ఇచ్చారు. కదిరికి వరాల జల్లుటీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కదిరి ప్రజలకు వరాలజల్లు కురిపించారు. టీడీపీ, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి రాగానే తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చేర్లోపల్లి రిజర్వాయర్‌ నుంచి పట్టణానికి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రజలు డ్రెయినేజీ సమస్యతో ఇబ్బంది పడకుండా భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థను తీసుకొస్తామన్నారు. ట్రాఫిక్‌ సమస్య లేకుండా పాలిటెక్నిక్‌ కాలేజ్‌ నుంచి రాయచోటి రోడ్డు మీదగా కౌలేపల్లి గేటు జాతీయ రహదారికి అనుసంధానం చేసి ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. రాయచోటి వయా నంబూలపూలకుంట, గార్లపెంట మండలాలకు రహదారి మంజూరు చేస్తామన్నారు. ఎన్‌పి.కుంట, గాండ్లపెంట మండలాలకు హంద్రీనీవా కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామని తెలియజేశారు. కదిరి పట్టణంలో అసంబద్ధంగా నిలిచిపోయిన మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ పూర్తి చేస్తామని చెప్పారు. పట్టణంలో హిందూ శ్మశాన వాటిక లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని హిందూ శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తామని హమీ ఇచ్చారు.

➡️