కలెక్టర్‌ సారూ.. న్యాయం చేయండి..!

లేపాక్షి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట కళ్లకు నల్ల రిబ్బన్‌ కట్టుకుని మొకాళ్లపై నిరసన తెలుపుతున్న దళితులు

          హిందూపురం : లేపాక్షి రెవెన్యూ అధికారులు కుశలవా ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌ వారితో కలిసి భూ రికార్డులను మార్చి తమ భూములను వారికి కట్టబెడుతున్నారని దీనిపై కలెక్టర్‌ స్పందించి న్యాయం చేయాలని బాధిత దళిత రైతులు కోరారు. న్యాయం చేయాలని కోరుతూ గణతంత్ర దినోత్సవం రోజున లేపాక్షి మండల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట కళ్లకు నల్ల రిబ్బను కట్టుకుని మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ‘కలెక్టర్‌ స్పందించి న్యాయం చేయండి.. మా భూములను మాకు ఇప్పించండి’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నెలల తరబడి న్యాయం కోసం ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా తమ సమస్యలను ఎవరూ పరిష్కరించలేదన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని కలిసి తమ సమస్యను వివరించి, న్యాయం చేయాలని కోరామన్నారు. ఆయన స్పందించి కలెక్టర్‌కు సిఫార్సు చేస్తూ లేఖ ఇచ్చారన్నారు. ఆ లేఖను కలెక్టర్‌కు ఇచ్చి న్యాయం చేయాలని కోరినప్పటికీ ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదన్నారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన తహశీల్దార్‌, ప్రస్తుత తహశీల్దార్‌ బాబులు కలిసి కుశలవా ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌ వారికి కుమ్మక్కు అయ్యి లేపాక్షిలో కాకుండా హిందూపురం తహశీల్దార్‌ కార్యాలయంలో రాత్రి సమయాల్లో కుర్చోని భూ రికార్డులను మార్చారన్నారు. వీటిన్నింటినీ ఆధారాలతో సహా బయట పెట్టినప్పటికీ వారిపై చర్యలు చేపట్టలేదన్నారు. పిఒటి చట్టం 9/77లోని సెక్షన్‌ నెంబర్‌ 4 బిఐఐ సిసిఎల్‌ఎ వారు ఇచ్చిన ఆర్‌సి 7961/2007ను ఉల్లంఘిస్తూ, భాధితుల ప్రణాలతో చెలగాటం ఆడుతున్నారని నష్టపోయిన రైతులు కన్నీరు మున్నీరు పెట్టుకున్నారు. ఇంత జరుగుతున్న బాదితులను జిల్లా కలెక్టర్‌ పలకరించలేదంటే దీని వెనుక పెత్తందారుల ప్రభావం ఉందన్న అనుమానాలు ఉన్నాయన్నారు. ఇప్పటికైన కలెక్టర్‌ లేపాక్షి మండలం కొండూరు గ్రామాన్ని సందర్శించి బాదితులతో చర్చించి, అధికారులతో దీనిపై సమగ్ర విచారణ జరిపి దళితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాదిత దళిత రైతులు పాల్గొన్నారు.

➡️