సూర్యనారాయణకే టికెట్టు ఇవ్వాలి

సూర్యనారాయణకు మద్దతుగా ధర్మవరంలో ర్యాలీ చేస్తున్న మద్దతుదారులు

        ధర్మవరం టౌన్‌ : కూటమిలో భాగంగా ధర్మవరం టికెట్టు కేటాయింపు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కన్పించడం లేదు. టిడిపి, జనసేన, బిజెపి కూటమిలో భాగంగా ఈ టికెట్టును బిజెపికి కేటాయించారు. బిజెపి నంచి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బరిలో నిలుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి సూర్యనారాయణ మద్దతుదారులు ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారు. గత మూడు రోజులుగా ధర్మవరం స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా మరొకరు ఉంటారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సూర్యనారాయణ మద్దతుదారులు మంగళవారం నాడు ఆందోళనకు దిగారు. సూర్యనారాయణకు టికెట్టు ఇవ్వాలని కోరుతూ మంగళవారం ఉదయం ధర్మవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మారుతీరాఘవేంద్రస్వామి కల్యాణమండపం నుంచి ప్రారంభం అయిన ర్యాలీ పోలీసు ఆర్టీసీ బస్టాండ్‌ వరకు కొసాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గోనుగుంట్ల సూర్యనారాయణ 2014-19 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా ఉంటూ ధర్మవరం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. అలాంటి వ్యక్తికి టికెట్టు ఇవ్వకుండా స్థానికేతరునికి ఇవ్వాలనుకోవడం సరికాదన్నారు. ఈ ర్యాలీలో బిజెపి నాయకులు డిష్‌ రాజు, చిగిచెర్ల అరవిందరెడ్డి, గొట్లూరు చంద్ర, తుంపర్తి పరమేశ్‌, దేవరకొండ రామకృష్ణ, టైలర్‌ కుళ్లాయప్ప, నబీరసూల్‌, చిలకం సూర్యనారాయణరెడ్డి, బొడగల గిరిధర్‌, బెస్తశివ, మల్కాపురం హరి, మార్కెట్‌ రహీం, రామ్మూర్తినాయుడు, వీరన్న, గంధమనేని నారాయణస్వామి, బోయనపల్లి సుజాత, గరుగు పద్మావతి పాల్గొన్నారు.

➡️