దీపం-2 పథకం కింద 5,36,289 మందికి లబ్ది

Oct 30,2024 22:53

గ్యాస్‌ ఏజెన్సీ వారితో మాట్లాడుతున్న కలెక్టర్‌

                    పుట్టపర్తి క్రైమ్‌ : జిల్లాలో దీపం-2 పథకం ద్వారా 5,36,289 గ్యాస్‌ కనెక్షన్లకు లబ్ధి చేకూరనుందని జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని సాయిఆరామం ఎదురుగా ఉన్న ప్రశాంతి గ్యాస్‌ ఏజెన్సీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సివిల్‌ సప్లై అధికారి వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకం పొందే విషయంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా అన్ని విధాల సహకరించాలని గ్యాస్‌ పంపిణీ దారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం దీపం-2 పథకం కింద అర్హులైన పేద కుటుంబాల వారికి సంవత్సరానికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందజేసేందుకు ఈనెల 31వ తేదీ నుండి శ్రీకారం చుట్టనుందన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో చురుకుగావున్న ఎల్‌పిజి కనెక్షన్‌, ఆధార్‌ నంబరు, బియ్యపు కార్డు, ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతా నంబరు కలిగి ఉన్నవారు ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు పొందుటకు అర్హులన్నారు. ఈ పథకము దీపావళి పండుగ పురస్కరించుకొని ఈనెల 31వ తేదీ నుండి ప్రారంభం అవుతుందన్నారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందే లబ్ధిదారులు వారి గ్యాస్‌ ఏజెన్సీ నందు గ్యాస్‌ కోసం బుకింగ్‌ చేసుకుని గ్యాస్‌ ధరను గ్యాస్‌ ఏజెన్సీ వారికి పూర్తిగా మొదట చెల్లించాలన్నారు. ఆ తరువాత అర్హులైన లబ్ధిదారులకు 2 రోజులలో వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా డిబిటి పద్ధతిలో జమ చేయబడుతుందన్నారు. ఈ పథకం కింద మొదటి ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పొందగోరు లబ్ధిదారులు 2025 సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు వారి గ్యాస్‌ ఏజెన్సీ వద్ద బుకింగ్‌ చేసుకునే సదుపాయం ఉందన్నారు. మొదటి ఉచిత సిలిండర్‌కు బుకింగ్‌ చేసిన 24 నుండి 48 గంటల్లో లబ్ధిదారులకు సరఫరా చేయవలసి ఉంటుందన్నారు. ఈ పథకంపై ఏమైనా అభ్యంతరాలు గాని, సూచనలు గాని, సమస్యలు గానీ ఉంటే టోల్‌ ఫ్రీ నెంబరు 1967కు ఫోన్‌ చేసి తెలపవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️