ప్రజాశక్తి-శ్రీ సత్యసాయి జిల్లా: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో ఓ మహిళ జుట్టును కత్తిరించిన సంఘటనపై తక్షణమే పెనుగొండ పోలీసులు స్పందించి, అందుకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసినట్లు డి.ఎస్.పి వెంకటేశ్వర్లు వెల్లడించారు. వివరాల మేరకు.. మునిమడుగు గ్రామానికి చెందిన అమ్మాయి రెండు రోజుల క్రితం తప్పిపోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తక్షణమే ఈ కేసును సీరియస్గా రెండు రోజుల వ్యవధిలోనే అమ్మాయిని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పజెప్పారు. ఈ సంఘటనలో మైనర్ అమ్మాయిని మాయ మాటలు చెప్పి వెంట తీసుకెళ్లారని అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడు పై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని డిఎస్పి తెలిపారు. అయితే ఈ జంట పారిపోవడానికి మహిళ కారణమని కేసులో ఎక్కడ ఆమెపై ఫిర్యాదు చేయలేదని, కేవలం అనుమానంతో బాలిక కుటుంబ సభ్యులైన మహిళలు ఈరోజు ఆమెపై దాడి చేసి జడ కత్తిరించడం జరిగిందని, అయితే పెనుగులాటలో బట్టలు చిరిగిపోయాయి. ఈ సంఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో తక్షణమే సీఐతో పాటు మునిమడుగు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టడం జరిగిందన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు డి.ఎస్.పి వెల్లడించారు. అయితే ఇరువురు బంధువులేనన్నారు. గ్రామంలో ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త తీసుకుని పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని డిఎస్పీ తెలిపారు. ఎవరు గొడవలకు దిగినా పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డిఎస్పి హెచ్చరించారు.
