అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను చూపుతున్న ఎస్పీ

ప్రజాశక్తి-అనంతపురం క్రైం

తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడే అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను అనంత పోలీసులు అరెస్టు చేశారు. వారిని రూ.22 లక్షల విలువజేసే 310 గ్రాముల బంగారు నగలు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్‌ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంకు చెందిన షేక్‌ ఖాజాపీరా అలియాస్‌ ఖాజా, మహేష్‌, జమీర్‌లు ముఠాగా ఏర్పడి ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే వారు. వీరిలో షేక్‌ ఖాజాపీరా అలియాస్‌ ఖాజా కీలక నిందితుడు. పెయింటర్‌గా పని చేసే ఇతనికి ఇద్దరు భార్యలు, ఏడుగురు పిల్లలున్నారు. కుటుంబ పోషణకు అతను చేస్తున్న సంపాదన సరిపోక 2021 నుంచి తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాతో సహా ఆంధ్రప్రదేశ్‌లో 14, కర్నాటక రాష్ట్రం బాగేపల్లిలో 4, కోలార్‌ జిల్లాలో 5, తెలంగాణాలోని శంషాబాద్‌లో 4 దొంగతనాలు చేశాడు. ఈ కేసుల్లో ఇతను జైలుకు వెళ్లి ఈ ఏడాది మార్చిలో విడుదలై వచ్చాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత ధర్మవరానికి చెందిన మహేష్‌, జమీర్‌లను కలుపుకుని మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ముగ్గురూ కలిసి అనంతపురం రూరల్‌, త్రీ టౌన్‌, 4 పట్టణ, యాడికి, ఇటుకలపల్లి పోలీసు స్టేషన్ల పరిధిలో 10, కర్నాటకలోని కోలార్‌లో 4 దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనాలు చేసే ముందు ముగ్గురూ కలిసి కారును బాడుగకు తీసుకుని జమీర్‌ డ్రైవ్‌ చేస్తుంఢగా మహేష్‌ తాళం వేసిన ఇళ్లను గమనిస్తుంటే ఖాజా ఒక్కడే వెళ్లి దొంగతనం చేసేవాడు. దొంగతనాల నియంత్రణపై పోలీసులు నిఘా ఉంచడంతో అనంతపురం సమీపంలోని కళ్యాణదుర్గం రోడ్డు రజాక్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్ద నిందితులను ముగ్గురిని మంగళవారం ఉదయం పట్టుకున్నారు. వీరి నుంచి ఒక కారు, 310 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన అనంతపురం సీసీఎస్‌ సిఐ ఇస్మాయిల్‌, రూరల్‌ సిఐ శేఖర్‌ బాబు, ఎస్‌ఐ కె.రాంబాబు, సీసీఎస్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, మల్లికార్జున, చంద్రశేఖర్‌, గిరిబాబు, జయకర్‌, కానిస్టేబుళ్లు శివయ్య, పాండవ, ఆంజనేయ ప్రసాద్‌, రంజిత్‌, బాలకృష్ణ, షామీర్‌, రాజశేఖర్‌లను ఎస్పీ అభినందించారు.

➡️