కియా అనుబంధ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

పరిశ్రమలో ఎగిసిపడుతున్న మంటలు

     సోమందేపల్లి : శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల పరిధిలోని గుడిపల్లి ఇండిస్టియల్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన కియా అనుబంధ పరిశ్రమ ఎస్‌ఎల్‌ఎపి పరిశ్రమలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు… ఎస్‌ఎల్‌ఎపి కంపెనీలో వెల్డింగ్‌ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసి పడి మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు అధికం కావడంతో అక్కడున్న వారంతా పరుగులు తీస్తూ బయటకు వచ్చేశారు. అక్కడ పని చేస్తున్న వారు అప్రమత్తం అయి బయటకు రావడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. కాగా ఈ ప్రమాదంలో పరిశ్రమకు సంబంధించి పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు తెలుస్తోంది. నష్టం అంచనా ఇంకా వేయాల్సి ఉందని పరిశ్రమ ముఖ్య ఉద్యోగులు తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో వారు అక్కడికి వెళ్లి మంటలను ఆర్పారు. ప్రమాద విషయం తెలుసుకున్న సోమందేపల్లి ఎస్‌ఐ విజరు కుమార్‌ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన చేపట్టారు.

➡️