నకిలీనోట్లను చూపుతున్న బాధితుడు
ప్రజాశక్తి – కదిరి టౌన్
కదిరిలో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ముదిగుబ్బ మండలానికి చెందిన నాగేశ్ తో పాటు మరికొందరు కదిరి వ్యవసాయ మార్కెట్ యార్డు నందు జరిగే పశువుల సంతలో తమ పొట్టెళ్లను విక్రయించడానికి మంగళవారం తెల్లవారుజామునే మార్కెట్‌కి చేరుకున్నారు. సందట్లో సడేమియా ఆన్న రీతిలో మోసాలకు పాల్పడే కేటుగాళ్లు నాగేష్ అనే వృద్ధుడి వద్దకు వెళ్లి రెండు పొట్టేలను కొనుగోలు చేసి 32 వేల రూపాయల నకిలీ 500 రూపాయల నోట్లను అందజేసి పొట్టేలు తీసుకొని వెళ్లారు. నాగేష్ ఆ డబ్బును ఇతరులకి ఇస్తుండగా వారు వాటిని నకిలీ నోట్లు గా గుర్తించారు. దీంతో వృద్ధుడు లబోదిబోమన్నాడు. ఇదే కేటుగాళ్లు పశువులు మార్కెట్లో మరో ఇద్దరికి నకిలీ నోట్లను అంటగట్టారు. బాధితులు కేటుగాళ్ల కోసం మార్కెట్ యార్డు తిరిగినా వారి ఆచూకీ లభించలేదు. నకిలీ నోట్ల మోసగాళ్లను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని గొర్రెలు కాపరులు, వ్యాపారస్తులు కోరుతున్నారు.