రెండేళ్లయినా ముందుకు పడని అడుగు

Jun 9,2024 21:33

కొట్టుకుపోయిన వంతెన స్థానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన

                 హిందూపురం : హిందూపురం రూరల్‌ మండలంలోని పలు గ్రామాలు హిందూపురం పట్టణానికి, కర్నాటకలోని అనేక గ్రామాలకు రాకపోకలకు స్థానిక పోచనపల్లి వద్ద పెన్నా నది మీద ఉన్న వంతెనే ఆధారం. దీనిని 70 ఏళ్ల కిందటే అప్పటి పాలకులు నిర్మించారు. అప్పటి నుంచి నేటి దాకా కనీస మరమ్మతులు సైతం చేయలేదు. నాలుగుసంవత్సరాల క్రితం పెన్నా ఉధృత ప్రవాహానికి వంతెన మధ్య భాగం దెబ్బతింది. అప్పటి నుంచి మరమ్మతులు చేయించాలని ఈ ప్రాంత ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బలరామిరెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకొని గత వైసిపి ప్రభుత్వ హయాంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. దీంతో రెండున్నర ఏళ్ల కిందట రూ.80 లక్షలు మంజూరయ్యేలా చూశారు. ఈ నిధులతో వంతెన దెబ్బతిన్న పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పెన్నా నది ప్రవాహానికి వంతెన మధ్య భాగం పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆయా గ్రామాలకు, పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలియకుండా ఆ సమయంలో కర్నాటక ప్రాంతం నుంచి ఒక వ్యక్తి హిందూపురం పట్టణానికి వస్తూ వంతెన దెబ్బతిన్నచోట నుంచి కిందికి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సమీప గ్రామ ప్రజల డిమాండ్‌ మేరకు కూలిన వంతెన వద్ద రాకపోకలను పునరుద్ధరించడానికి రెండేళ్ల కిందట తాత్కాలికంగా రూ.10 లక్షలతో ఇనుప వంతెన నిర్మాంచారు. దీనిపైన ద్విచక్రవాహనాలు, సైకిళ్లు పోవడానికి, పాదచారులు నడిచి వెళ్లడానికి అవకాశం దక్కింది. భారీ వర్షాల సమయంలోనూ, నది ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలోనూ తాత్కాలిక వంతెన పనులు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో పట్టణానికి చెందిన ఓ గుత్తేదారుడు పనులు చేశారు. ఆయనకు ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు. బిల్లు కోసం అధికారుల చుట్టూ రెండేళ్లుగా తిరుగుతున్నారు. తాత్కాలిక పనులు కావడంతో ఈ వంతెన మూన్నాళ్ళ ముచ్చటగా మారింది. అది కూలిపోయే పరిస్థితి రావడంతో ప్రస్తుతం దాని మీద రాకపోకలు నిలిపివేశారు. ఆ సమయంలో ప్రవాహం నిలిచి పోగానే వంతెన పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పినా నేటికీ రూపాయి పని చేయలేదు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు చేయడానికి గుత్తేదారులు ముందుకు రాలేదు. పనుల్లో పురోగతి లేక, కూలిన వంతెన పక్కన నదిగర్భంలో నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వంతెన కూలిన విషయం తెలియక, దాని మీద ప్రయాణం చేసిన ఇతర ప్రాంతాల వారు తరచూ ప్రమాదాల పాలవుతున్నా అధికారులు, పాలకుల్లో కనీస స్పందన లేదు. వంతెన పనులు పూర్తికాకపోవడంతో ఓ నిండు ప్రాణం బలయిందని పలువురు వాపోతున్నారు. ప్రస్తుతం కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నా ఉధృతంగా ప్రవహించే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఆయా గ్రామాలకు, పట్టణానికి రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.నూతన ప్రభుత్వం, అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

➡️