కౌంటింగ్‌కు పటిష్ట భద్రత : కలెక్టర్‌

కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలన చేస్తున్న కలెక్టర్‌ అరుణ్‌ బాబు

        హిందూపురం : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి పటిష్ట భద్రతను ఏర్పాటు చేసి, స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి ఈవీఎంలను కౌంటింగ్‌ హాల్‌కు తీసుకెళ్లడానికి, కౌంటింగ్‌ ఏజెంట్ల కౌంటింగ్‌ హాల్‌కు వెళ్లేందుకే ప్రత్యేకంగా బ్యారికేట్లను ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అరుణ్‌ బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు హిందూపురం రూరల్‌ మండలం గుడ్డంపల్లి వద్ద ఉన్న బిట్‌ కళాశాల, లేపాక్షి వద్ద గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లను తనిఖీలు చేశారు. భద్రతాపరమైన అంశాలలో సిబ్బందికి తగిన సూచనలు జారీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బిట్‌ కళాశాలలో మొదటి అంతస్తులో సివిల్‌ ఇంజినీరింగ్‌ బ్లాక్‌లో మడకశిర నియోజకవర్గం అసెంబ్లీ, పార్లమెంట్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. మొదటి అంతస్తులోని ల్యాబ్‌బ్లాక్‌లో కదిరి నియోజకవర్గం, సెకండ్‌ ఫ్లోర్‌ ఈఈఈ బ్లాక్‌లో పెనుగొండ, గ్రౌండ్‌ ఫ్లోర్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీర్‌ బ్లాక్‌లో హిందూపురం అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు. పార్లమెంట్‌ నియోజవర్గానికి విడివిడిగా ఓట్లు లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు వెళ్లేందుకు ఈవీఎంలు తీసుకెళ్లాడానికి అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు వెళ్లేందుకు వేర్వేరుగా బ్యారికేడింగ్‌ ఏర్పాట్లను చేయాలన్నారు. ఓట్లు లెక్కింపు కేంద్రాల్లో సిసి కెమెరాలు, కంట్రోలో రూమ్‌లో టివిలు ఏర్పాటు చేయాలని కమ్యూనికేషన్‌ ఇంజినీరును ఆదేశించారు. అంతకు మునుపు లేపాక్షిలోని నాయనపల్లి క్రాస్‌ వద్ద చోళసముద్రం వద్ద డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో పుట్టపర్తి, ధర్మవరం, అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. గురుకుల పాఠశాల మొదటి అంతస్తులో పుట్టపర్తి నియోజకవర్గం, రెండో అంతస్తులో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్‌ పక్రియ నిర్వహిస్తున్నామన్నారు. హిందూపురం పార్లమెంటు నియోజక వర్గానికి సంబంధించిన పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ ప్రక్రియ గురుకుల పాఠశాల గ్రౌండ్‌ ఫ్లోర్‌ మూడో నెంబర్‌ రూమ్‌లో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, డిఆర్‌ఒ కొండయ్య, పుట్టపర్తి నియోజకవర్గం ఆర్‌ఒ భాగ్యరేఖ, ధర్మవరం నియోజకవర్గ ఆర్‌ఒ వెంకట శివ సాయిరెడ్డి, కదిరి నియోజకవర్గం ఆర్‌ఒ వంశీకృష్ణ, మడకశిర నియోజకవర్గ ఎన్నికల అధికారి గౌరీ శంకర్‌ పాల్గొన్నారు.

➡️