నిరసనలో భాగంగా అదానీ పరిశ్రమ ప్రధాన రోడ్డుపై చీనీకాయలు పడేసిన రైతులు
ప్రజాశక్తి-తాడిమర్రి
తాడిమర్రి మండలంలో అదానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న హైడల్ పవర్‌ప్రాజెక్టు రైతుల జీవితాల్లో చీకట్లను నింపుతోంది. పరిశ్రమ వద్ద ఏర్పాటు చేస్తున్న మట్టి కుప్పులు, కంకర మిషన్ల వల్ల వెదజల్లుతున్న పొడితో దాడితోట, పెద్దకోట్ల, చిల్లకొండయ్యపల్లి గ్రామాల పంట పొలాల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తమకు జరుగుతున్న అన్యాయాన్ని పరిశీలించి న్యాయం చేయాలని సమీప గ్రామాల రైతులు ఎన్ని సార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. అదానీ పరిశ్రమ కాలుష్యం వల్ల దెబ్బతిన్న చీనీ కాయలను పరిశ్రమ ప్రధాన రహదారిపై వేసి గురువారం నాడు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అదానీ పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అక్కడ నిల్వ ఉంచుతున్న మట్టి కుప్పలు, కంకర మిషన్ల నుంచి వస్తున్న దుమ్ము, ధూళితో సమీప గ్రామాల్లో సాగు చేస్తున్న అరటి, దానిమ్మ చీనీ పంటల దెబ్బతింటున్నాయన్నారు. ఈ చెట్లపై దుమ్ము పేరుకుపోవడంతో కాత రావడం లేదన్నారు. కాయలు కాసినా అవి పెద్దగా అవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరిగా లేని కాయలను కొనేందుకు ఏ వ్యాపారీ ముందుకు రావడం లేదన్నారు. ఈ సమస్యపై గతంలో రెండు,మూడు సార్లు ఆందోళన చేసిన అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందిచకుంటే తమ పంట పొలాలన్నీ బీడుగా మార్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు.