అధికారుల నిర్లక్ష్యంతో కౌన్సిల్‌ సమావేశం వాయిదా

Sep 30,2024 22:27

అధికారుల కోసం ఎదురు చూస్తున్న సభ్యులు

                  పెనుకొండ: ప్రజా సమస్యలను చర్చించేందుకు ఏర్పాటుచేసిన అత్యవసర కౌన్సిల్‌ సమావేశం అధికారుల నిర్లక్ష్యంతో వాయిదా పడింది. సోమవారం పెనుకొండ నగర పంచాయతీ అత్యవసర కౌన్సిల్‌ సమావేశం చైర్మన్‌ ఉమర్‌ ఫరూక్‌ అధ్యక్షతన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సమావేశం మూడు గంటలకు ప్రారంభమవుతుందని కౌన్సిల్‌, కో ఆప్షన్‌ సభ్యులకు మున్సిపల్‌ సిబ్బంది సమాచారం అందించారు. మూడు గంటలకు ప్రారంభమవుతుందని చైర్మన్‌ ఉమర్‌ ఫరూక్‌ వైస్‌ చైర్మన్‌ సునీల్‌ కుమార్‌, కౌన్సిల్‌ సభ్యులందరూ 2:45గంటలకే సమావేశం భవనంలో హాజరయ్యారు. సమావేశం నాలుగు గంటలు అయినా ప్రారంభం కాలేదు. సమావేశం ప్రారంభించాల్సిన కమిషనర్‌ శ్రీనివాసులు మేనేజర్‌ నాగరాజులు సమావేశానికి గైర్హాజరయ్యారు. కౌన్సిల్‌ సభ్యులు నాలుగు గంటల వరకు వేచిచూశారు. సమస్యలు చర్చించేందుకు అధికారులు లేనప్పుడు తాము సమస్యలు ఎవరితో చెప్పుకోవాలని అసహనం వ్యక్తం చేశారు. సభ్యుల కోరిక మేరకు చైర్మన్‌ సమావేశాన్ని వాయిదా వేశారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమావేశాన్ని ప్రారంభించి నడిపించాల్సిన కమిషనర్‌ మేనేజర్లు ఇద్దరు సమావేశానికి హాజరు కాకపోవడంతోనే వాయిదా వేసినట్లు తెలిపారు. మూడు నెలలుగా సమావేశమే నిర్వహించలేదని నగర పంచాయతీలో పలు సమస్యలు నెలకొన్నాయని సభ్యులు సమస్యల పరిష్కారం కోసం చర్చించేందుకు సిద్ధ మైన నేపథ్యంలో అధికారుల లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందారని ఆయన అన్నారు. సమావేశం ప్రారంభించిన అనంతరం కమిషనర్‌ వెళ్లి ఉంటే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు.

➡️