పాల కల్తీకి ఉపయోగించిన పదార్థాలు
ప్రజాశక్తి-అనంతపురం
కల్తీపాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. రాప్తాడు మండలంలో వివిధ పదార్థాలతో పాలను కల్తీ చేస్తున్న ఓ వ్యక్తిని గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు. అనంతపురం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ వైబిపిటిఎ.ప్రసాద్ ఆదేశాల మేరకు డీఎస్పీ నాగభూషణం, సిఐ సద్గురుడు, ఏవో వాసుప్రకాష్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తస్లీం, రెవెన్యూ అధికారులతో కలసి రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం ఎర్రగుంట రామిరెడ్డి ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీ సమయంలో పాలు చిక్కగా కనిపించేందుకు పలు పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. పాలు చిక్కిగా మారేందుకు పామ్‌ఆయిల్, ఉప్పు, మాల్టోడెక్స్ట్రిన్ పౌడర్, నీటిని కలిపి చిక్కని ద్రవం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పాలు తాగడం వల్ల గ్యాస్ట్రిక్, క్యాన్సర్ రోగాలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. కల్తీపాల నమూనాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించి పరిశీలన నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు. పాల కల్తీకి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజిలెన్స్ డీఎస్పీ తెలిపారు. ఎక్కడైనా పాలు కల్తీ చేస్తున్నట్లు తెలిస్తే విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.