ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి
అనంతపురం జిల్లా అంటూనే ప్రకృతి వైపరితాల్యకు నిలయం. 2024లో అతివృష్టి, అనావృష్టి రెండూ నెలకొన్నాయి. ఇలా రెండు విధాలుగానూ రైతులు నష్టపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు వైపులా నష్టాలే జరిగాయి. కరువు మండలాలకు సంబంధించి పంటనష్టం అంచనా వేయడానికి కేంద్ర కరువు బృందం ఈ వారంలో పర్యటించింది. ఆగస్టులో కరువు నెలకొంటే జనవరిలో కేంద్ర కరువు బృందం రావడం బట్టి పాలకులకు కరువు పట్ల ఏ మేరకు శ్రద్ధ ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారి పర్యటన వివరాలను కూడా ఎక్కువగా బయటకు పొక్కనీయకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. వారి పర్యటన వివరాలను కూడా మీడియాకు ముందుగా తెలియజేయకపోవడం గమనార్హం. అంతా గోప్యతోనే అదును అయిపోయాక కరువు బృందం జిల్లా పర్యటన చెప్పింది. అది కూడా నాలుగు గ్రామాల్లో పర్యటించి మమ అనిపించేసి వెళ్లిపోయింది. ఆగస్టు తరువాత పడిన వర్షాలతో ఎక్కడ చూసినా పచ్చదనం ఇప్పటికీ నెలకుని ఉంది. ఈ పరిస్థితుల్లో కరువు బృందం పంటనష్టాన్ని ఏ మేరకు అంచనా వేయగలిగిందన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఇక వర్షాలతోనూ ఈ ఏడాది పంటనష్టం సంభవించింది. ఈ లెక్కలను అధికారులు ప్రభుత్వానికి నివేదించి ఉంది. ఈ నష్టం అంచనాను కేంద్ర కరువు బృందం పరిశీలిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. మొత్తంగా వర్షాభావం, వర్షాలు రెండింటి వలన కూడా రైతులు ఈ ఏడాది పంటలు నష్టపోయారు. ఈ పంటనష్టంపై అధికార, విపక్ష పార్టీలు కూడా పెదవి విరుస్తున్నాయి. అన్ని మండలాలను కరువు మండలాలు ప్రకటించాల్సిందని కోరుతున్నారు. కాని కరువు పారా మీటర్సులో అన్ని మండలాలు పిక్స్ అవనందునే అన్ని మండలాలు కరువు మండలాల కింద రాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నష్టంలోనైనా రైతుకు ఏ మేరకు సాయం అందుతుందో చూడాల్సి ఉంది. ఈ వారంలో ప్రధాన చర్చనీయాంశం అవుతున్నది హంద్రీనీవా. దీనికి లైనింగ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. అనంతపురం జిల్లా వంటి కరువు ప్రాంతంలో వర్షాలు పడటమే తక్కువ. ఇటువంటి సమయంలో లైనింగ్ చేస్తే భూగర్భ జలాలలై దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. లైనింగ్ చేయకుండా కేవలం వెడల్పు మాత్రమే చేయాలని సూచిస్తున్నారు. అది చేయడం వల్ల కాలువ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోనూ భూగర్భ జలాలు అభివృద్ధి చెందాడానికి వీలుంటుందంటున్నారు. 2012 నుంచి అనంతపురం జిల్లాకు హంద్రీనీవా ద్వారా నీళ్లు వస్తున్నాయి. ఈ కాలంలో చూసినప్పుడు కాలువ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు చాలా వరకు పెరిగి ఉన్నాయి. కావున వెడల్పు చేసి లైనింగ్ ఆపాలని కోరుతున్నారు. ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ఆధునీకరణ గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.