మంత్రికి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే, మాజీ మంత్రి
పుట్టపర్తి రూరల్ : విజయవాడ వరద బాధితుల సహాయార్థం పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల తరపున రూ.25 లక్షల విలువ జేసే చెక్కును ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి రాష్ట్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌కు గురువారం అందజేశారు. అమరావతిలోని ప్రభుత్వ సచివాలయంలో మంత్రి నారా లోకేష్ ఛాంబర్‌లో ఈచెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,పల్లె రఘునాథ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వరద బాధితులకు ఆర్థికంగా సాయం అందించిన పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల మేలు ఎన్నటికీ మర్చిపోలేమన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు వరద బాధితులకు ఇది వరకే గన్నవరం ,మైలవరం నియోజవర్గాల్లో ఉన్న వరద బాధితులకు సుమారు రూ. 50 లక్షలు విలువ చేసే ఆహార ధాన్యాలను అందించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.
పెనుకొండ : విజయవాడ వరద బాధితులకు పెనుకొండ నియోజకవర్గంలో దాతలు ఇచ్చిన రూ.3.50 లక్షల విలువైన చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి ఎస్.సవిత గురువారం అందించారు. మంత్రిమండలి సమావేశం అనంతరం సిఎం చంద్రబాబునాయుడుకు మంత్రి చెక్‌ను అందజేశారు. పెనుకొండ పట్టణానికి చెందిన ప్రగతి, రేవతి, బాబా ఫక్రూద్దీన్, దాదా పీర్, బాబా మహిళా గ్రామ సమాఖ్యల్లోని సభ్యులిచ్చిన రూ.1.50 లక్షలు, గోరంట్ల మండలం బూదిలి గ్రామానికి చెందిన భ్రమరాంభిక మహిళా సంఘ సభ్యులు ఇచ్చిన రూ.50 వేలు, ఆంధ్రప్రదేశ్ బ్యాంకు రిటైరీస్ ఫెడరేషన్ రూ.లక్ష, పరిగి మండలకేంద్రానికి చెందిన ఇటుక బట్టీ యజమానులు రూ.50 వేలు వరద బాధితుల సహాయార్థం అందించారు.