సెక్రటరీ లేక మూతపడిన సచివాలయ భవనం
హిందూపురం : నిర్లక్ష్యానికి నిదర్శనం సచివాలయ సెక్రటరీలు అని చెప్పవచ్చు. కనీస పనులు సైతం చేయకుండా ఉదయం, సాయంత్రం రెండు పూటలా హాజరు వేసి, వేతనాలను తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సచివాలయ సెక్రటరీల సేవలను వినియోగించుకోవాలని ఆయా సచివాలయాలలో విధులు నిర్వహించే ఆయా విభాగాల సెక్రటరీలకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో మునిసిపల్ కమిషనర్ సంగం శ్రీనివాసులు, మున్సిపల్ ఇంజనీర్లు పురపాలక సంఘ వ్యాప్తంగా ఉన్న అమ్యూనిటీ సెక్రటరీలతో గతవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను, వారు నిర్వర్తించాల్సిన విధుల గురించి వివరించారు. సక్రమంగా విధులు నిర్వర్తించకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ పురపాలక సంఘ వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న అమ్యూనిటీ సెక్రటరీలు అధికారుల ఆదేశాలను బేఖాతారు చేస్తున్నారు. వారు వచ్చిందే సమయం…. చేసిందేఉద్యోగం అన్న విధంగా అమ్యూనిటీ సెక్రటరీలు విధులు నిర్వహిస్తున్నారు. హిందూపురం పురపాలక సంఘంలో 43 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయంలోనూ అయా విభాగాలకు సంబంధించిన పది మంది సెక్రటరీలు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో అమ్యూనిటీ సెక్రటరీలు వారు విధులు నిర్వహించే సచివాలయల పరిధిలో తాగునీటి సరఫరా, పైప్ లైన్ మరమ్మతులు, మురుగు కాలువలు, రోడ్లు, కల్వర్టులు, వీధి దీపాల నిర్వహణ, డిసిల్టేషన్ తదితర పనులతో పాటు ప్రతి రోజు ఉదయం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల హాజరును ఆయా సచివాలయాల్లోనే తీసుకోవాల్సుంది. వార్డులో పర్యటించి అభివృద్ధి పనులకు సంబంధించిన ఎస్టిమేషన్ సిద్ధం చేసి పురపాలక సంఘానికి పంపాలి. ఆయా వార్డుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ఎం బుక్ లో నమోదు చేయాల్సిన బాధ్యత అమ్యూనిటీ సెక్రటరీలపై ఉంది. వీటితో పాటు జరుగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేయించాల్సి ఉంది. అయితే ప్రతి రోజు ఉదయం 7 :30గంటలకు అమ్యూనిటి సెక్రేటరీలు ఆయా సచివాలయాల వద్ద వారి పరిధిలో ఉన్న వీధి దీపాలు, వాటర్ మ్యాన్, తదితర అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల హాజరు తీసుకోవాల్సి ఉంది. అయితే వారు ఉదయం 8 : 30 గంటలు అయినప్పటికి సచివాలయానికి వచ్చి వారి హాజరు తీసుకోవడం లేదు. దీంతో ఎవరు ఎక్కడికి వెళుతురన్నారో అర్థం కావడం లేదు. గత నాలుగు రోజులుగా పట్టణ వ్యాప్తంగా నీటి సమస్య తీవ్రం అయింది. వెంటనే సచివాలయాల పరిధిలో అమ్యూనిటి సెక్రటరీలు పర్యటించి, ప్రత్యామ్నాయంగా ట్యాంకర్లను ఏర్పాటు చేసి, నీటి సరఫరా చేసి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అయినా తమకు ఎందుకు అనే విధంగా వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికైన మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్లు వీరి పనివిధానాన్ని సమీక్షించాలని స్థానికులు కోరుతున్నారు.