పోస్టర్లను ఆవిష్కరిస్తున్న బాలోత్సవ కమిటీ నాయకులు
ప్రజాశక్తి-అనంతపురం
ఈనెల 14, 15, 16వ తేదీల్లో అనంతపురం నగరంలో ‘అనంత బాలోత్సవం -5’ నిర్వహించనున్నట్టు అనంత బాలోత్సవ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు ఈ మూడు రోజుల కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆహ్వాన కమిటీ విడుదల చేసింది. శనివారం ఉదయం స్థానిక క్రీసెంట్ స్కూల్‌లో కమిటీ అధ్యక్షురాలు ఎస్.షమీమ్ షఫివుల్లా ఆధ్యర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బాలోత్సవం నిర్వహణపై మీడియాతో మాట్లాడారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏటా అనంతపురం నగరంలో అనంత బాలోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఐదవ సంవత్సరం ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. ఎప్పటిలాగా అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో కాకుండా ఈసారి లలిత కళాపరిషత్‌లో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ విషయాన్ని పిల్లలు, పాఠశాల యజమాన్యాలు గుర్తించాలని సూచించారు. ఈనెల 14, 15, 16 తేదీల్లో ఉత్సవాలు పెద్దఎత్తున నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కమిటీ సభ్యురాలు డాక్టర్ ప్రసూన మాట్లాడుతూ పిల్లల్లో చదువుల ఒత్తిడిని తగ్గించి, వారిలోనున్న ప్రతిభను వెలికితీసేందుకు బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా పిల్లల్లో దేశభక్తి, సమైక్యతను చాటే విధంగా ఉండాలని కమిటీ భావిస్తోందన్నారు. మరో సభ్యురాలు వి.సావిత్రి మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు భాగస్వామ్యులవుతారని చెప్పారు. మొత్తం సాంస్కృతిక పోటీలతోపాటు, అకడమిక్ విభాగాల్లో వేరువేరు తరహాల్లో పోటీలు జరుగుతాయన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను పిల్లల సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో అనేక మంది సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఈ పిల్లల పండుగలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎజి.రాజమోహన్, చంద్రకళ, రామాంజినమ్మ, ఓతూరు పరమేష్, సురేష్ పాల్గొన్నారు.