పంచాయతీ కార్యాలయం ముందు వ్యాపారుల నిరసన
సోమందేపల్లి : మండల కేంద్రంలో నిర్వహించే సంతను గుత్తేదారులు ఇష్టారాజ్యంగా వేలం పాడుకుని వ్యాపారులపై గతంలో కంటే మూడింతలు అధికంగా పన్ను వసూలు చేస్తున్నారంటూ సంతలో వ్యాపారం చేసుకునే వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు గురువారం స్థానిక మేజర్ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల సంత వేలం వేయగా రూ. 18.07 లక్షలకు వేలం దక్కించుకున్న వ్యక్తి మరో వ్యక్తికి గుడ్ విల్ రూపంలో అమ్మాడన్నారు. అతను గతంలో 100 రూపాయలు వసూలు చేసే అంగడికి 300 రూపాయలుగా నిర్ణయించాడని 300 రూపాయలను 600 రూపాయలుగా, 600 రూపాయలు అంగడికి 12 వందలుగా నిర్ణయించి వ్యాపారుల దగ్గర ఇస్తారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని గోరంట్లకు చెందిన వ్యాపారి సునంద, కురవాండ్లపల్లికి చెందిన వ్యాపారి శాంతమ్మ, కదిరికి చెందిన అరటి పండ్ల వ్యాపారి బాబా ఫక్రుద్దీన్‌తో పాటు రఫిక్, అంజలి, వెంకటేష్ తదితర వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తోపుడు బండికి గతంలో 50 రూపాయలు వసూలు చేస్తుంటే 200 రూపాయలు వసూలు చేస్తున్నాడని అతి తక్కువ రూ. 200 నుండి రూ. 1500 వరకు కట్టాలని హుకుం జారీ చేస్తున్నాడని వాపోయారు. కుండల వ్యాపారి దగ్గర గతంలో 50 రూపాయలు వసూలు చేస్తుండగా ప్రస్తుతం రూ. 300 ఇవ్వాలని అలా కట్టని వ్యక్తులను సరుకులు దించకూడదని అడ్డుపడటమే కాకుండా వ్యాపారం చేసుకునే స్కేలు ,బ్యాగులు తీసుకువెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెప్పే విధంగా చెల్లిస్తే గాని సంతకు రండి లేకపోతే రావద్దని గుత్తేదారుడు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడన్నారు. సంతలో అధికంగా మహిళలే వ్యాపారం నిర్వహిస్తామని మహిళలకు అత్యవసరమైన, టాయిలెట్లు గాని, తాగటానికి నీరు కానీ, అందుబాటులో లేవని అదేవిధంగా విచ్చలవిడిగా ఊరి పశువులు సంత మీద పడి వ్యాపారులకు ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. ఈ సమస్యలన్నీ పట్టించుకోకుండా ఎవరికివారు ఎటువంటి గెజిట్ లేకుండా ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇతనిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులును కోరారు. నిరసన విషయం తెలుసుకున్న పోలీసులు వ్యాపారులతో మాట్లాడారు. ఈవిషయంపై పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ గుత్తేదారుడు గతంలో ఎంత నిర్ణయించారో అంతే డబ్బులను వ్యాపారుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేయాలని అధికంగా వసూలు చేస్తే వారి వేలంపాటను రద్దు చేస్తామని చెప్పారు. వ్యాపారులు ఎట్టి పరిస్థితుల్లోనూ గతం కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ కట్టవలసిన అవసరం లేదని అన్నారు. వ్యాపారుల దగ్గర నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తే పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
వేలాన్ని రద్దు చేయాలి : వ్యకాసం
గ్రామపంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా కూరగాయల వ్యాపారస్తుల వద్ద సుంకాలు వసూలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుత్తేదారుడు బరితెగించి వసూళ్లు చేస్తున్నదానికి గ్రామపంచాయతీ అధికారులే కారణమని విమర్శించారు. బహిరంగ ప్రదేశాలలో సుంకాల ధరలకు సంబంధించి పట్టికలు ఏర్పాటు చేయాలని అనేకమార్లు ప్రజాసంఘాలు , వామపక్ష పార్టీలు విజ్ఞప్తులు చేసిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారు. ఇప్పటికైనా అధికారులు వారపు సంతలోని పేదలు , కష్టజీవులు, చిన్నపాటి కూరగాయల వ్యాపారుల నుంచి గ్రామ పంచాయతీ గెజిట్ ఆధారంగా సుంకాల వసూళ్లకు చర్యలు తీసుకోవాలని కోరారు.