శ్రీ సత్యసాయి జిల్లాలో మరో వాహన పరిశ్రమ

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి

సత్యసాయి జిల్లాకు మరో వాహన తయారీ పరిశ్రమ రానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఇది వరకే ఒప్పందం కుదిరింది. ఈ సంస్థ ఏర్పాటుకు అవసరమైన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో ఇప్పటికే ‘కియా’ కార్ల తయారీ పరిశ్రమ ఉన్న విషయం తెలిసిందే. దాని సమీపంలోనే మరో వాహన తయారీ పరిశ్రమ రానుంది. ఎలక్ట్రికల్‌ త్రీ వీలర్‌, ట్రక్కులు, బస్సులు తయారీ పరిశ్రమ గుడిపల్లి వద్ద ఏర్పాటు కానుంది.

ఆజాద్‌ ఇండియా మెబిలిటీ సంస్థ ఏర్పాటు

          సత్యసాయి జిల్లాలోని గుడిపల్లి సమీపంలో రూ.1046 కోట్ల వ్యయంతో ఎలక్ట్రికల్‌ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఆజాద్‌ ఇండియా మొబిలిటీ అనే సంస్థ ఇక్కడ ఎలక్ట్రికల్‌ ఆటోలు, ట్రక్కులు, బస్సులు తయారీ చేయనుంది. మూడు దశల్లో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఏప్రిల్‌ 2026 నాటికి మొదటి దశ, ఏప్రిల్‌ 2028 నాటికి రెండవ దశ, 2030 నాటికి మూడవ దశ పూర్తవనుంది. రూ.1046 కోట్లతోచేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా 2231 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ చెబుతోంది.

గుడిపల్లి వద్ద 70.71 ఎకరాలు కేటాయింపు

           గుడిపల్లి సమీపంలోనున్న ఎపిఐఐసి లేఅవుట్‌లో 70.71 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూముల కేటాయింపు కూడా దశల వారీగానే కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మొదటి దశకు 36 ఎకరాలు, రెండో దశకు 26 ఎకరాలు, మూడవ దశకు 8.71 ఎకరాలు ఇలా మూడు విడతల్లో భూ కేటాయింపులు జరపాలని ఎపిఐఐసికి ఆదేశాలిచ్చింది. దీంతో సత్యసాయి జిల్లాలో ఇప్పుడున్న కియాతోపాటు అదనంగా మరో వాహన పరిశ్రమ రానుంది. ఇదే కాకుండా మరో అతిపెద్ద పరిశ్రమ ఒకటి వచ్చే అవకాశముందని పరిశ్రమల శాఖ మంత్రి టిజి.భరత్‌ అనంతపురం జిల్లాకు విచ్చేసిన సందర్భంలో ప్రకటించారు. ఆ పరిశ్రమ ఏదన్న దానిపై ఇంకా పూర్తి స్థాయి స్పష్టత లేదు. త్వరలో వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇవి కార్యరూపం దాలిస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు కొంత వరకు మెరుగుపడే అవకాశాలున్నాయి.

➡️