నారాయణ విద్యాసంస్థలకు నిబందనలు వర్తించవా..?

Apr 11,2025 21:44

పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

                    హిందూపురం : కూటమి ప్రభుత్వంలో మంత్రి గా ఉన్నా నారాయణకు సంబందించిన నారాయణ విద్యా సంస్థలకు ప్రభుత్వ నిబంధనలు వర్తించవా అని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఈరేష్‌, నాగర్జున విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. నారాయణ పాఠశాలలో ముందస్తు అడ్మిషన్లు చేసుకోవడంతో పాటు నిబంధనలు అతిక్రమించి పాఠశాలలో పుస్తకాలను విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శుక్రవారం పాఠశాల ముందు ఆందోళన చేశారు. విద్యాశాఖ అధికారులు వెంటనే ఇక్కడికి వచ్చి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని ఎంఇఒ గంగప్పకు తెలిపినా ఆయన అక్కడికి రాలేదు. దీంతో నాయకులు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేసి, డిప్యూటి తహశీల్దార్‌ మైనూద్దీన్‌ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఈరేష్‌ మాట్లాడుతు నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ముందస్తు ప్రచారాలు, అడ్మిషన్లు నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అంతే కాకుండా యూకేజీ నుండి పదవ తరగతి వరకు రూ.30 వేల నుంచి 50వేల రూపాయల వరకు విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు కనీస క్రీడ మైదానం మౌలిక సదుపాయాలు కూడా సరిగా కల్పించడం లేదన్నారు. ఫీజులతో పాటు ఇక్కడే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, బుక్స్‌ టైలు కొనాలని నిబంధన పెట్టి రూ. 10 నుంచి 25 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. విద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చిన నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సురేష్‌, భరత్‌ చంద్ర, మహేష్‌, హరి, రవి తదితరులు పాల్గొన్నారు.

➡️