కలెక్టర్‌కు సమస్యను వివరిస్తున్న జి.ఓబులు
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
సమ్మె సందర్భంగా వేతనాల మంజూరుపై ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమించాం, అయినా ఇప్పటికీ వేతనాలు ఇవ్వకపోవడం సరికాదని సిఐటియు నాయకులు విమర్శించారు. ఉమ్మడి అనంతరం జిల్లాలో శ్రీసత్యసాయి, శ్రీరామ్ రెడ్డి తాగునీటి సరఫరా పథకంలో పనిచేస్తున్న కార్మికులకు బకాయి వేతనాలు చెల్లింపు, సమ్మె కాలపు హామీల అమలుపై గురువారం నాడు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టర్ వినోద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు మాట్లాడుతూ తాగునీటి సరఫరా కార్మికుల సమ్మె సందర్భంగా వేతనాల మంజూరు, ఇతర సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ మేరకు ఆందోళన విరమించామన్నారు. ఇంతవరకు వేతనాలు ఇవ్వకపోవడం దారుణం అన్నారు. సత్యసాయి తాగునీటి కార్మికులకు మూడు నెలల వేతనాలు చెల్లించారని, శ్రీరామ్ రెడ్డి కార్మికులకు మాత్రం ఒక్క నెల వేతనాలు కూడా చెల్లించలేదన్నారు. చెల్లించిన వేతనాలను కూడా తాగునీ వాటర్ బేస్ విధానంతో ఇస్తామని చెప్పడం మోసం చేయడమే అన్నారు. ఈ విధానం వల్ల కార్మికులకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. మోటార్ రిపేర్‌కి వస్తే 20 రోజులు నెలలు తరబడి మరమ్మతులు చేయని పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి సమయంలో ఈ విధానం అమలు చేస్తే ఇస్తున్న అరకొర వేతనం కూడా చేతికందని పరిస్థితి ఉంటుందన్నారు. పాత విధానంలోనే కార్మికులకు వేతనాలు చెల్లించాలని కోరారు. పూర్తి స్థాయిలో వేతనాలు మంజూరు చేయకుంటే కార్మికులు మళ్లీ సమ్మెలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. స్పందించిన కలెక్టర్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీరామిరెడ్డి తాగునీటి కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆర్.ఎర్రిస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రాము, కోశాధికారి స్వామి, ఉపాధ్యక్షులు నరేష్, సత్యసాయి కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్.శ్రీనివాసులు, కోశాధికారి ఎం.శ్రీనివాసులు పాల్గొన్నారు.