లోటుపాట్లు లేకుండా ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు

హెలీప్యాడ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

ప్రజాశక్తి-బొమ్మనహాల్‌

30వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా, బొమ్మనహల్‌ మండలం నేమకల్లు గ్రామానికి వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని కలెక్టర్‌ డా||వి.వినోద్‌కుమార్‌, ఎస్పీ జగదీష్‌లు అధికారులు, పోలీసు సిబ్బందికి సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నేమకల్లు గ్రామాన్ని గురువారం పరిశీలించారు. హెలిప్యాడ్‌ స్థలం, ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ లబ్ధిదారుల గహాలు, నేమకల్లు ఆంజనేయస్వామి దేవాలయం, గ్రామసభ నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్‌, ఎస్పీ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. హెలిప్యాడ్‌ వద్ద ఆర్‌అండ్‌బి అధికారులు బ్యారికేడ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. హెలిప్యాడ్‌ నుంచి వెళ్లే రూట్‌ మ్యాప్‌లను పక్కాగా సిద్ధం చేయాలన్నారు. సౌండ్‌ సిస్టం, ఎల్‌ఈడి స్క్రీన్స్‌ ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని శానిటేషన్‌ తదితర వాటిపై ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల రాకపోకలకు అసౌకర్యం కలిగించకుండా, హంగూ ఆర్బాటాలకు పోకుండా సజావుగా గ్రామ సభను నిర్వహించే విధంగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీవో వసంత బాబు, జెడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సంపత్‌, సర్వే ఏడీ రూప్లనాయక్‌, అనంతపురం మున్సిపల్‌ కమిషనర్‌ నాగరాజు, డిఐపిఆర్‌ఒ గురుస్వామి శెట్టి అన్ని శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.

➡️