గడ్డితిని నిరసన తెలుపుతున్న శ్రీరామిరెడ్డి కార్మికులు
ప్రజాశక్తి-కళ్యాణదుర్గం రూరల్
నెలల తరబడి వేతనాలు ఇవ్వకుంటే గడ్డితిని బతకాలా అంటూ శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా కార్మికులు అధికారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెండింగ్ వేతనాలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా గురువారం ఉదయం కళ్యాణదుర్గం శ్రీరామిరెడ్డి తాగునీటి పంప్‌హౌస్ వద్ద కార్మికులు పచ్చిగడ్డి తింటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ వేతనాల కోసం కార్మికులు సమ్మె చేపట్టి ఐదు రోజులు కావస్తున్నా అధికారుల్లో చలనం రావడం లేదన్నారు. వేతనాల కోసం ప్రతి నెలా కార్మికులు సమ్మె చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం కార్మికుల పట్ల కనకరం లేకుండా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే పెండింగ్ వేతనాలన్నింటినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి రంగనాథ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు భవిత్, శ్రీరామిరెడ్డి యూనియన్ నాయకులు వన్నూరు స్వామి, పి.నరేష్, అల్లాబకాస్, చిత్తప్ప, గురుమూర్తి, జి.వెంకటేశులు, మురళి పాల్గొన్నారు.