విలేకరులతో మాట్లాడుతున్న రాంభూపాల్
ప్రజాశక్తి-కదిరి అర్బన్
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం కార్పొరేట్లకు మేలు చేసేదిలా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్ విమర్శించారు. పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లో ప్రజా సంక్షేమం ఎక్కడా లేదన్నారు. ముఖ్యమైన రంగాలకు నిధులు కేటాయించకపోవడంతో దేశ ప్రజలందరూ నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి చర్యలు లేవన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారంపై కేంద్రం ఎలాంటి స్పష్టతనూ ఇవ్వలేదన్నారు. ఆహార సబ్సిడీలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం తదితర వాటి కేటాయింపులు గతేడాదికి కంటే తగ్గించారన్నారు. ఉపాధి హామీ పథకానికి అదనంగా నిధులను కేటాయించాల్సి ఉండగా ఆ దిశగా కేటాయింపులు చేయకపోవడం విచారకరం అన్నారు. ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుతో ప్రజలపై మరింత భారాలను మోపిందన్నారు. బడ్జెట్‌లో చేసిన మోసాన్ని తెలియజేసేలా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జంగాలపల్లి పెద్దన్న, లక్ష్మీనారాయణ, జిఎల్.నరసింహులు, పట్టణ కమిటీ నాయకులు ముస్తాక్, బాబ్‌జాన్, జగన్, రామ్మోహన్, రఫీ, ఉదరు, అంజి, అఖిల్ పాల్గొన్నారు.