హిందూపురం మున్సిపల్ కార్యాలయం
హిందూపురం : హిందూపురం మున్సిపాలిటీకి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ను నియమించారని.. ఇక కౌన్సిల్ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం హిందూపురం పురపాలక సంఘంలో వైసిపి మద్దతుతో గెలిచిన చైర్ పర్సన్ ఇంద్రజ తన పదవికి ఆగస్టు నెలలో రాజీనామా చేశారు. దీంతో అప్పటి నుంచి పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదు. దీంతో పురపాలికలో ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచి పోయింది. ఈనేపథ్యంలో అధికారులు వైస్ చైర్మన్ బలరామిరెడ్డిని ఇన్‌ఛార్జి ఛైర్మన్ గా ఎంపిక చేస్తూ పక్షం రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఛైర్మన్ ఎంపిక జరిగి 15 రోజులు అవుతున్నప్పటికీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడానికి అధికారులు చొరవ చూపకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెలలో సమావేశం జరగక పోతే కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంది. అయితే పురపాలక సంఘంలో వైసిపి మద్దతుతో ఉన్న చైర్మన్ ఉండడంవల్ల, నిబంధనను అడ్డుపెట్టుకుని కౌన్సిల్‌ను రద్దు చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పాటు వైసిపి మద్దతుతో గెలిచిన కౌన్సిలర్లు టిడిపిలో చేరారు. ప్రస్తుతం వైసీపీ చైర్మన్ ఉండడంవల్ల తాము సమావేశానికి హాజరు కాలేకపోతున్నామని, స్థానిక టిడిపి ఇన్‌చార్జుల ముందు మొర పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆగిన అభివృద్ధి పనులు హిందూపురం పురపాలక సంఘానికి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక పేరు ఉంది. ఇలాంటి పురపాలక సంఘంలో గత మూడు నెలలుగా కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అధికారులకు అత్యవసరం కింద రూ. 99 వేల వరకు మాత్రమే ఖర్చు చేయడానికి అధికారం ఉంది. దాని కన్నా ఎక్కువ ఖర్చు చేయాలంటే తప్పని సరిగా కౌన్సిల్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం ఛైర్మన్ ఉంటే ముందస్తు అనుమతులు తీసుకుని నిధులు ఖర్చు చేసి, కౌన్సిల్ ఆమోదం అనంతరం నిధులు మంజూరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మూడు నెలల పాటు ఛైర్మన్ లేకపోవడం, ఇన్‌ఛార్జి ఛైర్మన్ ఎంపిక జరిగి 15 రోజులు పూర్తి అవుతున్నప్పటికీ అధికారులు సమావేశం నిర్వహించడానికి ముందుకు రాకపోవడంతో పురపాలికలో కనీస అభివృద్ధి కనుచూపు మేర కనిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించే విధంగా చర్యలు తీసుకుని, పట్టణ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పురప్రజలు కోరుతున్నారు.