సమస్యలపై మంత్రికి సిఐటియు వినతులు

మంత్రికి వినతిపత్రం అందిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌

శ్రీసత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా పథకం కార్మికులకు బకాయి వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు కోరారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను కలెక్టరేట్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ నెలనెలా కార్మికులకు వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యం కొనసాగుతోందన్నారు. కార్మికులకు సకాలంలో వేతనాలు, గ్రాట్యూటీ, బోనస్‌ వంటి చెల్లించాలన్నారు. 10 సంవత్సరాల పైబడి పని చేస్తున్న కార్మికులందరిని సెమిస్కిల్డ్‌ వేతనాలు చెల్లించాలన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులు చెల్లించాలన్నారు. ప్రమాదాలకు గురైన కార్మికులకు రూ.25 లక్షలు చెల్లించాలన్నారు. తాగునీరు ఉచితంగా అందించాలని, నీటి మీటర్లు బిగించరాదన్నారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు, మున్సిపల్‌ కార్మికుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.నాగభూషణ, జిల్లా అధ్యక్షులు ఎటిఎం.నాగరాజు ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం అందించారు. ఇంజనీరింగ్‌ కార్మికులకు 36 జీవో ప్రకారం రూ.21 వేలు వేతనాలు ఇవ్వాలన్నారు. నగర విస్తీర్ణం జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలన్నారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ, క్యాజువల్‌ లీవులు అమలు చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేసి వారి సమస్యలు పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి వై.వెంకటనారాయణ ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం అందించారు. కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి, శ్రీరామిరెడ్డి కార్మికుల యూనియన్‌ నాయకులు ఎన్‌.శ్రీనివాసులు, జి.త్రిలోక్‌నాథ్‌, ఆర్‌.ఎర్రిస్వామి, వన్నూర్‌స్వామి, భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు ముత్యాలప్ప, జిలాన్‌బాషా, గ్రానైట్‌ టైల్స్‌, లేయింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు ఎర్రిస్వామిరెడ్డి, వీరయ్య, రాడ్‌ బెండార్స్‌ యూనియన్‌ నాయకులు సూర్యనారాయణ, రాంమ్మోహన్‌ పాల్గొన్నారు.

➡️