ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు, కార్మికులు
ధర్మవరం రూరల్ : మండలం లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలకు వేతనాలు చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయాలు సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మోకాళ్ళ పైన కూర్చొని గడ్డి తింటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సిఐటియు నాయకులు జెవి రమణ, అయూబ్ ఖాన్, ఎల్ ఆదినారాయణ మాట్లాడుతూ 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత కోసం స్వచ్ఛ భారత్ అనే ముద్దు పేరుతో అనేక మంది మహిళలను పారిశుధ్య పనుల కోసం నియమించిందన్నారు. అప్పటినుంచి వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారన్నారు. ప్రతి కార్మికురాలికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బకాయి వున్న ఆరు నెలలు వేతనాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్యదర్శి నాగవేణి, అధ్యక్షురాలు లక్ష్మీదేవి, కోశాధికారి లక్ష్మి, కమిటీ సభ్యులు వరలక్ష్మి, అంజనమ్మ, వెంకటలక్ష్మి ఫరియాణ తదితరులు పాల్గొన్నారు.