నిరసన వ్యక్తం చేస్తున్న ఆశాకార్యకర్తలు, సిఐటియు రమేష్
పెనుకొండ టౌన్ : ఆశ వర్కర్ల పై వేధింపులు ఆపాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసంఘం ఆధ్వర్యంలో ఆశావర్కర్లు పట్టణంలోని యూపీహెచ్సీ ముందు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల నుంచి ఆశ వర్కర్లపై వేధింపులు అధికమయ్యాయని అన్నారు. వారు ఓపికతో పని చేసినప్పటికీ వైద్యాధికారి సౌమ్య కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రతిరోజు ఆశ వర్కర్లను దుర్భాషలాడుతోందన్నారు. అంతేకాక ఆమె పట్టణంలో ప్రైవేట్ క్లినిక్ పెట్టుకొని విధులకు సక్రమంగా హాజరు కావటం లేదని విమర్శించారు. ప్రతి ఒక ఆశ వర్కర్ తన ప్రైవేట్ క్లినిక్‌కు 10 మందిని పేషెంట్లు తీసుకురావాలని బెదిరిస్తోందన్నారు.ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి వైద్యాధికారి సౌమ్య పై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకురాలు తులసి, రాజేశ్వరి ,అలివేలమ్మ, గౌతమి తదితరులు పాల్గొన్నారు.మంత్రి సవితకి వినతి : పట్టణంలోని యూపీహెచ్ సీ ప్రభుత్వ వైద్య అధికారి సౌమ్యపై సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు మంత్రిని కలిసి తమ సమస్యను విన్నవించారు. తమను వైద్యాధికారి సౌమ్య వేధింపులకు గురి చేస్తోందని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకురాలు తులసి, రాజేశ్వరి, అలివేలమ్మ, గౌతమి ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి: టిడిపి పెనుకొండ : రోగులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్ సాయి సౌమ్య పై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పట్టణ పట్టణ కన్వీనర్ శ్రీరాములు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ సాయి సౌమ్య కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారన్నారు. విధులు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లపై వైద్యురాలు నానా దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై గతంలో మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వైద్యురాలి తీరులో మార్పు రాలేదని తెలిపారు.