వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
ధర్మవరం రూరల్ : ధర్మవరం పట్టణంలో మహిళా పొదుపు సంఘాల పేరుతో కొంతమంది అధికారులు నకిలీ సంఘాలను తయారు చేసి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని సిఐటియు నాయకులు విమర్శించారు. సిఐటియు ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు టీ. అయూబ్‌ఖాన్ మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో వందలాదిమంది మహిళలు మహిళా పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడం కోసం బ్యాంకులలో రుణాలు తీసుకుంటూ ఆ రుణాలను కంతులు వారీగా జమ చేసుకుంటూ వారి జీవన విధానాలను మెరుగుపరుచుకుంటున్నారన్నారు. అయితే ఆ మహిళా సంఘాలను ఆసరాగా చేసుకొని కొంతమంది మెప్మా అధికారులు, మహిళా గ్రూపుల లీడర్లు నకిలీ మహిళా పొదుపు గ్రూపులను తయారుచేసి బ్యాంకులలో కోట్లాది రూపాయలు రుణాలు డ్రా చేసుకుంటూ వారి దందాలను కొనసాగిస్తున్నారని విమర్శించారు. మహిళలతో ఎలాంటి సంతకాలు గాని గ్రూప్ ఫోటోలు గానీ లేకుండా, బ్యాంకులలో డబ్బులు డ్రా చేస్తున్నారన్నారు. బ్యాంక్ అధికారులు కూడా ఇలాంటివాటికి పరోక్షంగా సహకరిస్తున్నారన్నారు. నిజాయితీగా పొదుపు చేసుకున్న మహిళలకు రుణాలు ఇవ్వడానికి అనేక రకాల ఆంక్షలు విధించే బ్యాంకర్లు ఇలాంటి వారికి ఏ విధంగా రుణాలు మంజూరు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు జెవి. రమణ, టి. అయూబ్‌ఖాన్, ఎల్.ఆదినారాయణ పాల్గొన్నారు.