సజావుగా ఎన్నికలను నిర్వహిద్దాం : కలెక్టర్‌

ధర్మవరం మార్కెట్‌యార్డులో ఈవీఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

            పుట్టపర్తి రూరల్‌ : జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేంచేలా అధికారులందరూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో భాగ్యరేఖతో కలిసి బుధవారం నాడు మంగళకర కళాశాలలో పుట్టపర్తి – 159 అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించిన పిఒలు, ఏపీవోలకు ఎన్నికల విధుల నిర్వహణపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే వారందరూ విధులు, బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఆయా పోలింగ్‌ స్టేషన్లలో చేపట్టాల్సిన పనులు, ఈవీఎం యంత్రాల పనితీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్‌ రోజు సెక్టార్‌ అధికారుల సమన్వయ సహకారాలతో ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రిసిడింగ్‌, సహాయ ప్రిసిడింగ్‌ అధికారులు చేపట్టాల్సిన విధులను తెలుసుకోవాలన్నారు. పోలింగ్‌ రోజు పిఒలు, ఏపీవోలు, నిర్ణీత సమయానికి ఆయా పోలీస్‌ స్టేషన్‌లో ఈవీఎం పనితీరుపై మాక్‌ పోల్‌ నిర్వహణ, బ్యాలెట్‌ కంట్రోల్‌, వివి ప్యాట్ల కనెక్షన్లు వాటి పనితీరు, ఏవైనా మరమ్మతు జరిగితే వెంటనే తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఎన్నికల విధులపై నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని, హాజరుకాని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేసే ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని తెలియజేశారు. ఎన్నికల నిబంధనల పూర్తి స్థాయిలో పాటించాలిధర్మవరం టౌన్‌ : ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షున్నంగా పీఒలు, ఏపీఓలు తెలుసుకుని ఎన్నికల నిబంధనల మేరకు నడుచుకోవాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు సూచించారు. బుధవారం ఆర్డీవో కార్యాలయ సమావేశం భవనంలో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన పీఓ, ఏపీఓలకు మొదటి విడత శిక్షణ తరగతులకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్‌ నిర్వహణకు దాదాపు 12వేల మంది సిబ్బందిని నియమించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఎన్నికల విధులకు సంబంధించి నిర్వహించే శిక్షణా తరగతులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలింగ్‌కు ముందు రోజు ధర్మవరం మార్కెట్‌యార్డ్‌లో నియోజకవర్గానికి సంబంధించిన ప్రిసిడీంగ్‌ అధికారులు, సహాయ ప్రిసిడింగ్‌ అధికారులు ఏపీఓలను ఆయాపోలింగ్‌ స్టేషన్‌ విధులకు కేటాయిస్తామన్నారు. జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎన్నికలు జరిగేలా సిబ్బంది జాగ్రత్తగా వారి విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివారామిరెడ్డి, తహశీల్దార్‌ రమేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాంకుమార్‌, ట్రైనీలు రాంప్రసాద్‌, బి.శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️