బాండ్లు చూపిస్తున్న కార్మిక శాఖ అధికారి, నాయకులు
హిందూపురం : హిందూపురం మండలం గోళ్లాపురం పారిశ్రామిక వాడలో ఎ-1 ఇస్పాట్ స్టీలు పరిశ్రమలో గత ఏడాది డిసెంబర్ 12న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన బీహార్ రాష్ట్రానికి చెందిన సోమనాథ్ మహ అనే కార్మికుడి కుటుంబానికి పూర్తిస్థాయిలో పరిహారం అందజేశారు. అప్పట్లో యాజమాన్యం మృతుడి భార్యకు రూ.7.50 లక్షలను నష్టపరిహారంగా ఇచ్చి చేతులు దులుపుకుంది. దీంతో తూమకుంట పారిశ్రామిక వాడ కార్మిక సంఘం అధ్యక్షులు రవికుమార్ తదితరులు పరిశ్రమ యాజమాన్యంపై కార్మిక శాఖ అధికారులు, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా కార్మిక శాఖ కేసు నమోదు చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకొని చట్ట ప్రకారం పరిహారాన్ని అందజేయాలని ఆదేశించింది. దీంతో యాజమాన్యం గురువారం మృతుడి తల్లి శారదా దేవి పేరు మీద రూ.1,05,175లవిలువైన చెక్కు, అలాగే కుమార్తె శాలు కుమారికి రూ.1,60,078, కుమారులు నితీష్ కుమార్ పేరిట రూ.1,60,078, అభిషేక్ కుమార్ పేరిట రూ. 1,60,078 ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసిన బాండ్లను అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సూర్యనారాయణ కార్మిక నాయకులు రవికుమార్ కు అందజేశారు. కార్మిక నాయకులు చేసిన పోరాటాల ఫలితంగా బాధిత కుటుంబానికి అదనపు పరిహారం ఇప్పించినట్లు కార్మిక సంఘం నాయకులు రవికుమార్ తెలిపారు. దీని ద్వారా సంబంధిత కార్మిక కుటుంబానికి మొత్తం రూ.13,35,409 పూర్తిస్థాయి పరిహారం అందినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ నాయకులు సిద్ధగిరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.