పందేల జోరు..!

          అనంతపురం ప్రతినిధి : ఇప్పటి వరకు ఐపిఎల్‌ క్రికెట్‌లో పందేలు కాయడం చూశాం. అక్కడ బంతి.బంతికీ.. గెలుపోటములు ఇలా అనేక రకాలుగా పందాలు సాగుతూ ఉంటాయి. పందెం జూదరులకు ఐపిఎల్‌తోపాటు ఇప్పుడు మరో ఆట వారికి దొరికింది. సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలపై పందేలు సాగుతున్నాయి. ఈ పందేలు కూడా సాధారణం కాదు… పెద్ద మొత్తంలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు గెలుపోటములపై ఒక లెక్క అయితే… వచ్చే మెజార్టీపై మరో లెక్క. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పాట్లపై మరో పందేం ఇలా రకరకాలుగా జూదం నడుస్తోంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు పార్లమెంట్‌, 14 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఒక్కో నియోజకవర్గంపై ఒక్కో రకంగా పందేలు నడుస్తుండటం గమనార్హం. కొన్నింటిలో అభ్యర్థులు రాజకీయంగా అంత పలుకుబడి లేదనుకున్న చోట మరింత ఎక్కువగా పందేలు నడుస్తున్నాయి. మరికొన్ని ఏమో ప్రతిష్టాత్మకంగా ఉంటున్నాయి. కీలకమైన నాయకులు బరిలో ఉన్న చోట పందేలు కూడా ప్రతిష్టాత్మకంగానే మారుతున్నాయి. అనంతపురం పార్లమెంట్‌ పరిధిలో ఒక నియోజకవర్గంపైన గరిష్టంగా ఒకటికి 20 వంతులు కూడా పందేలు నడుస్తుండటం గమనార్హం. అంటే వారనుకున్న పార్టీ గెలిస్తే ఒకటిస్తే సరిపోతుందే.. ఓడిపోతే దానికి 20 వంతులు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక పార్టీ గెలిస్తే లక్ష రూపాయలిస్తే సరిపోతుంది. అదే పార్టీ ఓడిపోతే పందేం కాసిన వ్యక్తి రూ.20 లక్షల అవతలి వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈరకంగా ఒకటికి 16, ఒకటికి ఐదు కూడా నడుస్తున్నాయి. ఈ రకంగా పందేలు కాస్తున్న వారిలో ఈ ప్రాంతం వారే కాకుండా బయటి ప్రాంతాల వారూ ఉంటుండటం గమనార్హం.

ఎవరి లెక్కలు వారివి

   ఎన్నికల ఓటింగ్‌ పూర్తయిన 72 గంటల వరకు పోలింగ్‌ శాతంపై నిర్ధిష్టమైన లెక్కలొచ్చాయి. నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ శాతం బుధవారం రోజుకుగానీ అందుబాటులోకి రాలేదు. ఓటింగ్‌పై పూర్తి స్థాయి లెక్కలు రావడంతో ఆయ పార్టీల నేతలు తమ నాయకులతో కూర్చోని ఎక్కడ ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయన్న అంచనాలు వేసుకునే పనిలోనున్నారు. పెరిగిన పోలింగ్‌ శాతం తమకు అనుకూలమంటే.. తమకని ఎవరికి వారు అంచనాల్లోనున్నారు. దీనికితోడు సర్వే సంస్థల పేరుతో వస్తున్న అంచనాలను చూసుకుని తమకు అనుకూలంగా ఉంటే ఆనందపడుతుండగా వ్యతిరేకంగా ఉన్నచోట గుబులు పడుతున్నారు. ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు రావడానికి 18 రోజులు సమయం ఉంది. అంతవరకు ఈ అంచనాలు కూడా మారుతూనే ఉండనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ మాత్రం ఇద్దరి మధ్యనే నడిచింది. అటు వైసిపి, ఇటు టిడిపిల మధ్య ద్విముఖ పోరే నడిచింది. దీంతో గెలుపోటములు ఇద్దరి మధ్యనే ఉండనున్నాయి. ఎటువైపు ఓటరు మొగ్గుచూపారన్నది జూన్‌ నాలుగో తేదీన జరిగే ఓట్ల లెక్కింపు సమయంలోనే తేలే అవకాశముంది.

➡️