సమస్యను వివరిస్తున్న గ్రామస్తులు
మడకశిర : రొళ్ల మండలంలో జరుగుతున్న కులవివక్షపై ఆ గ్రామ దళితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అంటరానితనాన్ని నిర్మూలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రెవెన్యూ,పోలీస్ యంత్రాంగం అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. అయితే శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రొళ్ల మండలంలోని మల్లినమడుగు గ్రామంలో అగ్రవర్ణాలవారు ఇప్పటికీ దళితులపై కులవివక్ష చూపుతున్నారు. ఈ విషయంపై ఆ గ్రామ దళితులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని నెలలుగా తమ గ్రామంలో ఉన్న శ్రీ బసవేశ్వర స్వామి దేవాలయానికి తమలపాకుల పూజలు నిర్వహించుకోవడానికి అగ్రవర్ణాల వారు అనుమతించడం లేదన్నారు. కులవివక్ష చూపుతూ దళితులను కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దండోరా, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గంగాద్రి, నాయకులు రంగనాథ్, నాగన్న, గ్రామస్తులు రామచంద్రప్ప, భూతరాజు, పరమేష్, కదిరేష్, తిమ్మరాయప్ప, హనుమంతరాయుడు, జగన్నాథ్, తిమ్మరాజు, సురేష్,తదితరులు పాల్గొన్నారు.