టిడ్కోగృహాలను పూర్తి చేయండి : సిపిఎం

Apr 11,2025 21:45

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఇఎస్‌. వెంకటేష్‌

                     పుట్టపర్తి రూరల్‌ : మున్సిపాలిటీ పరిధిలో అర్ధాంతంగా ఆగిపోయిన టీడ్కో గృహ నిర్మాణాలను వెంటనే పూర్తిచేసి వాటిని లబ్ధిదారులకు అందజేయాలని సిపిఎం నాయకులు కోరారు. పుట్టపర్తి మండల పరిధిలోని కర్ణాటక నాగే పల్లి సమీపంలో 864 ఇండ్లను పూర్తి చేసి పట్టణంలో నివసించే లబ్ధిదారులకు అప్పగించాలని వారు కోరారు. ఈ మేరకు శుక్రవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈ ఎస్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం పేరుతో గత నెల 25న కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఈ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని రాతపూర్వకంగా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే ఇప్పటివరకు వాటిలో ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదన్నారు. దీన్ని బట్టి చూస్తే అధికారులకు ప్రజాసమస్యల పరిష్కారంలో ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోందని విమర్శించారు. జిల్లాలో ఇల్లు లేని నిరుపేదలకు కేటాయించిన టిడ్కోగృహ నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపివేయడం బాధాకరమన్నారు. పుట్టపర్తితో పాటు హిందూపురం, కదిరి ,ధర్మవరం పట్టణాల్లో కూడా వేలాది టీడ్కో గృహ నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగాయన్నారు. వీటిని బ్యాంకు రుణం ద్వారా నిర్మిస్తుండటంతో తీసుకున్న రుణం చెల్లించాలని లబ్ధిదారుల ఖాతాల్లో ఉన్న కొద్దిపాటి సొమ్మును బ్యాంకు అధికారులు జమ చేసుకోవడంతో పాటు లబ్ధిదారులకు నోటీసులు పంపించి రుణాలు వెంటనే చెల్లించాలని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. టిడ్కో రుణాలను వెంటనే రద్దు చేయాలని అసంపూర్తిగా నిలిచిపోయిన గృహ నిర్మాణాలను ప్రభుత్వ నిధులు ద్వారా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 15న ఆందోళన భాగంగా లబ్ధిదారులతో వెళ్లి జెండాలు పాతి డిడ్కో గృహాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి బ్యాళ్ల అంజి, నాయకులు ముత్యాలు, ఆఫీస్‌ కార్యదర్శి సిద్దు, భాష తదితరులు పాల్గొన్నారు.

➡️