అంగన్వాడీ సమస్యలపై 17న ఆందోళనలు

రాష్ట్రపతికి పంపనున్న వినతపత్రాలను చూపుతున్న అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు

ప్రజాశక్తి పుట్టపర్తి రూరల్‌

సమ్మె సందర్భంగా అంగన్‌వాడీలకు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బారావమ్మ పేర్కొన్నారు. శనివారం శ్రీ సత్యసాయి జిల్లా సిపిఎం కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర నాయకులు జి.ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌.వెంకటేష్‌, అంగన్‌వాడీ వర్కర్స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, జిల్లా ఉపాధ్యక్షురాలు రంగమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారావమ్మ విలేకరులతో మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యల పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో టిడిపి నాయకులు హామీలిచ్చిరని, అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా దాని గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఐసిడిఎస్‌కు నామమాత్రపు నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ సమస్యలను తెలియజేసేలా దేశవ్యాప్తంగా ప్రతి అంగనవాడీ కేంద్రం నుంచి రాష్ట్రపతికి వినతులు పంపుతున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచాలన్నారు. గ్రాట్యుటీ అమలు చేసి, కార్యకర్తలను మూడవ తరగతి, హెల్పర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. హెల్పర్లకు వర్కర్లుగా ఉద్యోగోన్నతి ఇవ్వాలని 2011లో ప్రభుత్వం జీవో ఇచ్చినా దానిని అమలు చేయలేదన్నారు. సత్యసాయి జిల్లాలో అంగన్‌వాడీలు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు రోజురోజుకూ అధికం అవుతున్నాయన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించి వేధింపులను నియంత్రించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి 17న చేపట్టిన ఆందోళనల్లో అంగన్‌వాడీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి,ఉషారాణి, సుశీల, వాసంతి, మహదేవమ్మ, ధర్మవరం సరస్వతి, హిందూపురం అరుణ, శోభారాణి పాల్గొన్నారు.

➡️