సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర నాయకులు రమణారావు
సోమందేపల్లి : భవన నిర్మాణరంగ కార్మికులను అన్ని విధాలా ఆదుకోవాలని సిఐటియు అనుబంధ భవన నిర్మాణసంఘం రాష్ట్ర అధ్యక్షులు నారపల్లి రమణారావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణమండపంలో సోమవారం భావన కార్మిక సంఘ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశా నికి ముఖ్యఅతిథిగా హాజరైన నారపల్లి రమణారావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు శ్రీ సత్య సాయి జిల్లాలో లక్ష మందికి పైగా ఉన్నారని అన్నారు. వారికి జిల్లాలో పనులు లేక బెంగళూరు చెన్నై నగరాలకు వలస వెళ్తున్నారన్నారు. గడిచిన ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చ ఏశారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో కూటమి నాయకులు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుకను ఉచితంగా ఇస్తామని వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారే కాని వాటిపై ఎలాంటి ఊసే లేదని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 120 రోజులు కావస్తున్నా సంక్షేమ బోర్డు, సంక్షేమ పథకాలు ఊసే ఎత్త లేదన్నారు రాష్ట్రంలో 30 లక్షల మంది దాకా నిర్మాణ కార్మికులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయన్నారు. దిష్టిబొమ్మల్లా ఉన్న లేబర్ ఆఫీసుల్ని నిర్మాణ కార్మికులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కొత్త లేబర్ కార్డుల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై అక్టోబర్ 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలకు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని చెప్పారు. సత్యసాయి జిల్లాలోని అన్ని రకాల నిర్మాణ కార్మికులతో పాటు ఇతర సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, అధ్యక్షులు రామకృష్ణ, సహాయ కార్యదర్శి రంగప్ప, నియోజకవర్గ కన్వీనర్ కొండా వెంకటేష్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు, మహిళా నాయకురాలు స్వర్ణలత, సోమందేపల్లి మండల నాయకులు నాగభూషణ, రవి, గోరంట్ల మండల నాయకులు కిరణ్, సురేష్ ,రామాంజి, పెనుకొండ మండల నాయకులు మధు, రొద్దం మండల నాయకులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు.