కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు, ఉద్యోగులపై నిర్లక్ష్యం తగదు

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ, కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని సిఐటియు నాయకులు విమర్శించారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం నాడు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌.వెంకటేష్‌, జిల్లా అధ్యక్షులు జడ్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ జిల్లా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇవ్వడం లేదన్నారు. కార్మిక చట్టాలను అమలు చేయడం లేదన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అందరికీ కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలన్నారు. గ్రాట్యుటీ, బోనస్‌, పబ్లిక్‌ సెలవులు, పే స్లిప్పులు, పిఎఫ్‌, ఐఎస్‌ఐ వర్తింపజేయాలన్నారు. కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. చెన్నెకొత్తపల్లి, పెనుగొండ, సోమందేపల్లి, గోరంట్ల, చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం, పరిగి, మడకశిర ప్రాంతాల్లో కియా అనుబంధ, గార్మెంట్‌ పరిశ్రమల్లో సుమారు 1.20 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారని వారందరికీ కనీస వేతనాలు అందించేలా చూడాలన్నారు. చాలా పరిశ్రమల్లో గత 17 సంవత్సరాలుగా వేతనాల్లో పెంపుదల లేదన్నారు. వీటన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 7వ పేకమిషన్‌ ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం పెంచాలన్నారు. బిజెపి ప్రభుత్వం తెచ్చిన లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలన్నారు. మహిళా కార్మికులకు పని ప్రదేశాల్లో అన్ని వసతలూ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

➡️