దళితుల శ్మశాన స్థలాన్ని కాపాడాలి

Jan 8,2025 22:27

అధికారితో మాట్లాడుతున్న నాయకులు, గ్రామస్తులు

                       చెన్నేకొత్తపల్లి : మండలంలోని బసంపల్లిలో దళితులు మృతిచెందితే ఖననం చేయడానికి ప్రతిసారి పోరాటం చేయాల్సి వస్తోందని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి అన్నారు. బుధవారం చెన్నే కొత్తపల్లి తాహశీల్దార్‌ సురేష్‌ బాబును బసంపల్లి దళితులతో కలసి శ్మశాన వాటికను కాపాడాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.మండల పరిధిలోని బసంపల్లి గ్రామంలో సర్వే నంబర్‌ 17 -1లో 1.39 ఎకరాల భూమిని మాలల శ్మశాన వాటిక కోసం జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు.అయితే అదే గ్రామంలోని కొంతమంది ఆక్రమించుకొని దౌర్జన్యంగా చెట్లు నాటారని వాపోయారు. ఏళ్ల తరబడి శ్మశాన వాటిక కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ అంతంత మాత్రమే న్యాయం జరుగుతోందన్నారు. ఎవరైనా దళితులు మృతిచెందితే మృతదేహాలను ఇళ్ల ముందుకు పెట్టుకుని ఎక్కడ పూడ్చాలో తెలియక అయోమయంలో పోలీసు రక్షణ ఉంటే తప్ప పూడ్చుకోలేకపోవడం బాధాకరమన్నారు. శ్మశాన వాటికను కబ్జా చేసిన వారు మాత్రం పేదలను కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తూ భయపెడుతున్నారన్నారు. శ్మశానవాటికలోకి ఎవరు పోవద్దంటూనే వాళ్లు మాత్రం దర్జాగా చెట్లుని పెంచుకోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి దళితులకు శ్మశాన వాటిక చెందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈకార్యక్రమంలో బసంపల్లి దళితులు కోట్ల మల్లికార్జున, ఎర్రిస్వామి, రామకృష్ణ, నరసింహులు, మల్లేశు, నాగమ్మ, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️