నిరసన వ్యక్తం చేస్తున్న బాధిత రైతులు, నాయకులు
ముదిగుబ్బ : ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ కబ్జా చేసిన తమ భూములను తిరిగి తమకే ఇప్పించాలని మండల పరిధిలోని అడవి బ్రాహ్మణపల్లి తాండ గ్రామ రైతులు, మహిళలు కోరారు. ఈ మేరకు వారు సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో ముదిగుబ్బ రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను తమ ప్రాంతానికి సంబంధంలేని వ్యక్తి తమకు తెలియకుండానే ఆయన పేరిట, ఆయన బంధువుల పేరిట రికార్డుల్లో నమోదు చేయించుకున్నారని ఆరోపించారు. రెవెన్యూ ఉన్నతాధికారులు రెండు రోజులు పాటు తమ గ్రామంలో తూతూ మంత్రంగా పరిశీలన చేసి నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తహశీల్దార్ నారాయణస్వామితో వాగ్వాదానికి దిగారు.కబ్జాకు గురైన గిరిజన రైతుల భూములను రెవెన్యూ అధికారులు తిరిగి వారికి ఇప్పించకపోతే నిరంతర ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లా శ్రీనివాసులు, తిప్పయ్య, గంగిరెడ్డిపల్లి నాయుడు, లింగుట్ల వెంకటరాముడు, రాధాకృష్ణ, ముత్తులూరి మధు, అమిలినేని రామంజి, కొండయ్య , బావయ్య తదితరులు పాల్గొన్నారు