రైతులకు నష్టం వాటిల్లే జీవోలను రద్దు చేయాలి

Apr 10,2025 22:34

వినతి పత్రం అందజేస్తున్న రైతు సంఘం నాయకులు

                        పెనుకొండ : రైతులకు నష్టం వాటిల్లే జీవో నెంబర్‌ 404,405 లను వెంటనే రద్దుచేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు హెచ్‌ ఎన్‌ ఎస్‌ ఎస్‌ అధికారులను కోరారు. ఈ మేరకు వారు గురువారం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈసందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హరి మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ లైనింగ్‌ పనులు నిలుపుదల చేసి వెడల్పు చేయాలన్నారు. హంద్రీనీవా ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో మూడు లక్షల 45 వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. తాగు, సాగునీరు కొరత తీరి జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. హంద్రీనీవా కాలువ లైనింగ్‌ పనుల వలన రైతులకు త్రీవ నిరాశ ఎదురవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన జీవో నెంబర్‌ 404,405 ఆచరణలోకి వస్తే హంద్రీనీవా లక్ష్యాన్ని నీరుగార్చినట్టే అవుతుందన్నారు. హంద్రీనీవా కాలువ రావడంతో బోర్లు వేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నా రైతులకు లైనింగ్‌ పనుల వలన భూగర్భ జలాలు అడుగంటి నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఒక్కసారి లైనింగ్‌ పనులు జరిగితే భవిష్యత్తులో కాలువ వెడల్పు చేయడానికి అనుకూలంగా ఉండదని అన్నారు. అదేవిధంగా మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ పనులు వెంటనే పూర్తి చేయాలని హంద్రీనీవా కాలువ సామర్థ్యం పదివేల క్యూసెక్కుల పెంచి పిల్ల కాలువల ద్వారా ఉమ్మడి జిల్లాలోని అన్ని చెరువులకు నీరు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్‌ బాబావలి ,మహబూబ్‌ బాష, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

➡️