అగ్రిమెంట్ కాపీని చూపిస్తున్న గుత్తేదారుడు
హిందూపురం : హిందూపురం పురపాలక సంఘంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా తాను ఆన్ లైన్ ద్వారా దక్కించుకున్న పనులకు సంబంధించి టెండర్ ఖరారులో అధికారులు తీవ్ర జ్యాప్యం చేస్తున్నారని చిత్తూరు జిల్లాకు చెందిన గుత్తేదారుడు గోవర్ధన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బుధవారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. గత సంవత్సరం హిందూపురం పురపాలక సంఘంలో రూ. 5 లక్షలు విలువ చేసే చెట్ల పంపిణీ కోసం ఆన్‌లైన్ విధానంలో టెండర్‌ను పిలవడం జరిగిందన్నారు. ఈ టెండర్ ఆన్‌లైన్ లో దక్కించుకొని, నిబంధనల మేరకు ఇఎండి, ఎపిటిఎస్ చెల్లించి అగ్రిమెంట్ సైతం పూర్తి చేసుకున్నానన్నారు. చెట్లను పంపిణీ చేస్తానని అధికారులకు కోరుతున్నప్పటికీ వారు ఒప్పుకోవడం లేదన్నారు. దీంతోపాటు రూ 16 లక్షలకు సంబంధించి చెత్త సేకరణ బండ్లు (పుష్ కార్డ్స్) తో పాటు పారిశుధ్య విభాగానికి సంబంధించిన వివిధ పరికరా కోసం ఆన్ లైన్ ద్వారా టెండర్ పిలిస్తే దీనిని సైతం తాను దక్కించుకున్నానన్నారు. అయితే ఈ పని విషయంలో అగ్రిమెంట్ చేసుకోవడానికి తిరుపతి నుంచి ఇక్కడికి పలుమార్లు వచ్చినప్పటికీ అగ్రిమెంట్ చేసుకోకుండా అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను వివరణ కోరగా చిత్తూరు జిల్లాకు చెందిన గుత్తేదారుడు గోవర్ధన్ బాబు గతంలో హిందూపురం పురపాలక సంఘంలో పలు టెండర్లను దక్కించుకుని సకాలంలో దానికి సంబంధించిన మెటీరియల్ ను పంపిణీ చేయలేదన్నారు. దీంతోపాటు పారిశుధ్య కార్మికుల కోసం కొబ్బరి నూనె, సబ్బులు, చెప్పులతోపాటు జాకెట్, ఇతర పరికరాలు సరఫరా చేస్తామని టెండర్ దక్కించుకుని సంవత్సరాలు గడిచినప్పటికీ సరఫరా చేయలేదన్నారు. వీధి దీపాల నిర్వహణలో భాగంగా ఎల్‌ఈడి లైట్ట మరమ్మతులకు సంబంధించిన మెటీరియల్ సైతం టెండర్ దక్కించుకుని సరఫరా చేయలేదన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సకాలంలో గుత్తేదారుడు సరఫరా చేయడని, ప్రస్తుతం దక్కించుకున్న టెండర్లకు సంబంధించిన మెటీరియల్ సరఫరా చేస్తే మిగిలిన పనులను అగ్రిమెంట్ చేసి ఇస్తామని సూచించామని తెలిపారు.