కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అపహాస్యం : వైసిపి

Feb 3,2025 21:20

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైసిపి నాయకులు

                     హిందూపురం : ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేసిందని, తమ పార్టీ సింబల్‌ తో గెలిచిన కౌన్సిలర్లను ప్రలోభాలు పెట్టి, భయపెట్టి హిందూపురం చైర్మన్‌ స్థానాన్ని దక్కించుకుందని వైసీపీ నాయకులు మండిపడ్డారు. సోమవారం హిందూపురం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక అనంతరం పార్టీ కార్యాలయంలో వైసిపి నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జి దీపిక, వైస్‌ చైర్మన్‌ జబీవుల్లా, వైసిపి నాయకులు వేణు రెడ్డి మాట్లాడుతూ, హిందూపురం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ట పాలు చేసిందన్నారు. కేవలం ఆరు స్థానాల్లో గెలుపొందిన టిడిపి ఏ విధంగా మున్సిపల్‌ చైర్మన్‌ పీఠానికి పోటీ చేస్తారన్నారు. సొంతంగా బలం లేకపోయినప్పటికీ వైసీపీతో గెలిచిన కౌన్సిలర్లను డబ్బులతో ప్రలోభాలు పెట్టి చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకున్నారని ఆరోపించారు. ఇప్పటికీ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ముద్దాయి అని ఆరోపించారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదని వారి అన్యాయాలు అక్రమాలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇక అధికారులు సైతం అధికార పార్టీకి అండగా ఉండి పని చేశారన్నారు. ఎన్నికల అధికారికి విప్‌ జారీ చేస్తూ ఇచ్చినప్పటికీ దానిని లెక్క చేయకుండా కేవలం ఐదు నిమిషాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశరన్నారని బలరామిరెడ్డి అన్నారు. త్వరలో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు కౌన్సిలర్లు, పాల్గొన్నారు.

➡️