మంత్రి సత్యకుమార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న టిడిపి నాయకులు
ధర్మవరం రూరల్ : ధర్మవరం మున్సిపల్ కమిషనర్ నియామకం విషయంపై ధర్మవరం తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. కొత్త కమిషనర్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయం ముందు శనివారం నాడు ఆందోళన చేపట్టారు. మంత్రి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం హయాంలో ధర్మవరంలో మున్సిపల్ కమిషనర్‌గా పని చేసిన మల్లికార్జున మళ్లీ ఇక్కడికి తీసుకురావడం సరికాదన్నారు. ఆయన కమిషనర్‌గా ఉన్నన్ని రోజులూ టిడిపి నేతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఆ అధికారిని మళ్లీ తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ఆందోళన విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసులు, 2వ పట్టణ సిఐ రెడ్డప్ప సిబ్బంది అక్కడి చేరుకున్నారు. టిడిపి నాయకులతో మాట్లాడి సర్ధి చెప్పి అక్కడి నుంచి పంపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి పట్టణ అధ్యక్షుడు పరిసే సుధాకర్, వార్డు ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు.