దిక్కులేని విశ్వవిద్యాలయాలు..!

       అనంతపురం ప్రతినిధి : పాలనాధ్యక్షుల్లేక విశ్వవిద్యాలయాలు దిక్కులేనివయ్యాయి. ఉద్యోగుల జీతాలు కూడా అందకుండా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. జిల్లాలో అనంతపురం జెఎన్‌టియు, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. రెండింటిలోనూ వైస్‌ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లు రాజీనామాలు చేశారు. ప్రస్తుతం రెండు చోట్లా ఇన్‌ఛార్జులతో పాలన నడుస్తోంది. ఈ ఇన్‌ఛార్జిలకు కూడా పూర్తి స్థాయి అధికారాల్లేవు. కేవలం లుక్‌ ఆప్టర్‌గా పెట్టారు. కొత్తగా రెగ్యులర్‌ వైస్‌ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లు ఎప్పటికి వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వైస్‌ఛాన్సలర్లు ఉన్నఫలంగా రాజీనామాలు చేసి వెళ్లడం, వాటిని ఆమోదించడంతో ఇన్‌ఛార్జీల పాలన తప్పనిసరైంది. వీరికి పూర్తి స్థాయి అధికారల్లేవు. కొత్త వైస్‌ఛాన్సలర్ల నియామకం జరగాలంటే మరో నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశం కన్పిస్తోంది. కొత్త వైస్‌ ఛాన్సలర్ల నియామకం జరగాలంటే ముందుగా సెర్చు కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ కమిటీ దరఖాస్తులను పరిశీలించి ముగ్గురు సభ్యులను ఎంపిక చేస్తారు. ఈ మూడు పేర్లలో ఒకరిని గవర్నర్‌ నియమిస్తారు. ఈ ప్రక్రియ అంతా జరగాలంటే కనీసం మూడు మాసాల సమయం పడుతుంది. ఇప్పటికి సెర్చు కమిటీల నియామకం జరగలేదు. దీంతో అది ఏర్పాటై కొత్త వైస్‌ ఛాన్సలర్ల నియామకం జరిగే వరకు ఇన్‌ఛార్జులతో నెట్టుకురావాల్సి ఉంటుంది.

జీతాలకూ తప్పని తిప్పలు

       రెగ్యులర్‌ వైస్‌ ఛాన్సలర్లు లేకపోవడంతో యూనివర్సిటీల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లింపునకూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడున్న తాత్కాలిక వైస్‌ ఛాన్సలర్లకు పూర్తి అధికారాల్లేవు. ఏదైనా ఆర్థికపరమైన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారముండదు. దీంతో ఉద్యోగులు, సిబ్బందికి వేతన ఇబ్బందులు తప్పడం లేదు. రెండు విశ్వవిద్యాలయాల్లో కలిపి రెండు వేల మంది వరకు ఉద్యోగులున్నారు. వారికి ఇప్పటి వరకు వేతనాలు అందలేదు. వచ్చే నెలలో రావాలంటే కూడా ఇప్పుడున్న వైస్‌ ఛాన్సలర్లకు అధికారాలుండవు. ప్రదానంగా జూన్‌ మాసంలో ఉద్యోగులు, సిబ్బందికి రుణాలు తీసుకోవాలంటే వైస్‌ఛాన్సలర్‌, రిజిస్ట్రార్ల ఆమోదం పొందాల్సి ఉంటుంది. పెన్షనర్ల అరియర్సుపైనా సంతకాలు జరగాల్సి ఉంది. మొదటి త్రైమాసికంకు సంబంధించి ఆర్థికపరమైన అనుమతులు ఉన్నప్పటికీ రెండో త్రైమాసిక ఆర్థిక అనుమతులు రెండు విశ్వవిద్యాలయాల్లోనూ తీసుకుని లేదు. ఇక ఇప్పుడు ఎంసెట్‌ కౌన్సిలింగ్‌లు జరుగుతున్నాయి. అందులో కళాశాలలో సీట్ల కేటాయింపుల్లో ఏదైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించాలంటే కూడా వైస్‌ఛాన్సలర్‌ ప్రధానం. ఆ అధికార స్థానం ఖాళీగా ఉండడంతో సమస్యలు నెలకొన్నాయి. ప్రభుత్వం ఎప్పటికి ఛాన్సలర్ల నియామకం చేపడుతుందో అని అటు ఉద్యోగులు, ఇటు విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.

➡️