సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్ ఛైర్మన్
హిందూపురం : వేసవిలో పట్టణవ్యాప్తంగా ఎక్కడ నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలను చేపట్టాలని నీటి సరఫరా విభాగం అధికారులను మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన కమిషనర్ సంఘం శ్రీనివాసులతో కలిసి నీటి సరఫరా విభాగంపై సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గొల్లపల్లి నుంచి హిందూపురానికి పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పలు వార్డుల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందన్నారు. నీటి సరఫరా విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పైప్ లైన్ లేని ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వార్డు స్థాయిలో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ సెక్రటరీలు, ఫిట్టర్ లు, వాటర్ మ్యాన్లు ఎప్పటికప్పుడు వారి పరిధిలో పైప్ లైన్ నిర్వహణపై పరిశీలన చేస్తూ ఉండాలన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోహన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.