అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్
పుట్టపర్తి అర్బన్ : వేసవిలో జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆర్డబ్ల్యూఎస్, డిపిఒ ఆధ్వర్యంలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు ఉమ్మడి జిల్లా డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఇ మల్లికార్జున, డిపిఒ సమత సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటినుంచే తగిన ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. రాబోయే ఆరు నెలల వరకు వేసవి ఉంటుందని నీటి సమస్య ఏర్పడకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసి సీఈఓ కు పంపాలని ఆదేశించారు. అలాగే ఏయే ప్రణాళికలు సిద్ధం చేశారో తనకు కూడా నివేదికలు అందించాలన్నారు. మండలాలు, పంచాయతీల వారిగా గతంలో ఎక్కడెక్కడ నీటి సమస్య ఉండేదో, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు ఏమిటి అన్న వివరాలు అందించాలన్నారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. వచ్చేవారం జరిగే సమావేశానికి తగిన నివేదికలతో హాజరు కావాలన్నారు. సత్యసాయి తాగునీటికి సంబంధించిన అధికారులు, నీలకంఠారెడ్డి, శ్రీరామ్ తాగునీటి ప్రాజెక్టు కు సంబంధించిన అధికారులు వచ్చే సమావేశానికి హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ సుబ్బారావు, డిఇఒ క్రిష్టప్ప, డిఎంహెచ్‌ఒ ఫిరోజ్ బేగం, ఐసిడిఎస్ పీడీ నాగమల్లేశ్వరి, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.