హెచ్‌ఎల్సీ అధికారులకు వినతిపత్రం అందజేస్తున్న వామపక్షాలు, కాంగ్రెస్, ప్రజాసంఘాల నాయకులు
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ : ‘జిల్లాకు ప్రాణాధారమైన హంద్రీనీవా కాలువను లైనింగ్ చేయడం వల్ల కాంట్రాక్టర్లకు ఉపయోగం తప్పా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు… ప్రభుత్వం స్పందించి కాలువను 10 వేల క్యూసెక్కులకు వెడల్పు చేసి, ఆయకట్టుకు నీరు ఇస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.’ అని వామపక్షాలు, కాంగ్రెస్, ప్రజాసంఘాల నాయకులు పునరుద్ఘాటించారు. హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వామపక్ష, కాంగ్రెస్ పార్టీలు, ఏపీ రైతు సంఘం, జలసాధన సమితి ఆధ్వర్యంలో హంద్రీనీవా ఎస్‌ఇ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. హెచ్‌ఎల్‌సి కాలనీ నుంచి ఎస్‌ఇ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ అధ్యక్షతన వహించిన ధర్నాలో ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓ.నల్లప్ప, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్, జల సాధన సమితి ఎస్‌ఎం.బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కరువు గురవుతున్న రాయలసీమ జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించాలనే ఉద్ధేశంతో 1988లో కృష్ణా జలాలలను రాయలసీమకు ఇచ్చేలా హంద్రీనీవాను ప్రారంభించారని తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద రాయలసీమ జిల్లాల్లో 6.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం ఉందన్నారు. అనంతపురం జిల్లాలో 3.40 లక్షల ఎకరాలకు నీరు అందించాల్సి ఉందన్నారు. 40 టిఎంసిల నీటి కేటాయింపులు ఉన్నా ఇప్పటి వరకు ఆ స్థాయిలో నీరు ఇచ్చిన దాఖాలాలు లేవన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు ఓ.నల్లప్ప, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ వెడల్పు చేయకుండా లైనింగ్ చేయడం సరికాదన్నారు. లైనింగ్ చేయడం వల్ల కాంట్రాక్టర్‌లకు లాభం జరుగుతుంది తప్పా రైతులకు ఎలాంటి లాభం లేదన్నారు. ఒకరకంగా లైనింగ్ పనులు రైతులకు మరణశాసనంగా మారుతాయన్నారు. లైనింగ్ పనులు నిలుపుదల చేసి కాలువను 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో వెడల్పు చేసే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం హెచ్‌ఎల్సీ అధికారులకు వినితిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి, మల్లికార్జున, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.రామిరెడ్డి, సిపిఐఎంఎల్ నాయకులు చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు ఇమామ్‌బాషా, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, సిపిఐ శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.