హంద్రీనీవాలో కదిలికొచ్చేనా..?

Jun 9,2024 21:29

హంద్రీనీవా కాలువ

                 అనంతపురం ప్రతినిధి: హంద్రీనీవా వెడల్పు పనులు ముందుకు సాగుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. శ్రీశైలం మాల్యాల నుంచి జీడిపల్లి రిజర్వాయరు వరకు మొదటి దశలో ప్రస్తుతం 1800 క్యూసెక్కులు నీటి ప్రవాహం వస్తోంది. దీని వలన శ్రీశైలం డ్యామ్‌కు వరద వచ్చిన సమయంలోనూ అధికంగా నీరు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. 1800 క్యూసెక్కులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. దీంతో వరద సమయాల్లో నీరు అధికంగా తీసుకునేందుకు వీలుగా హంద్రీనీవా కాలువ వెడల్పును ఆరు వేల క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించారు. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రవాహ సామర్థాన్ని పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు కూడా పిలిచారు. ఆరు వేల కోట్ల రూపాయల వ్యయంతో టెండర్లు పిలిచి మెగా సంస్థకు పనులు అప్పగించారు. కాని పనుల్లో కదలిక మాత్రం ఆఖరు వరకు రాలేదు. ఫలితంగా 2020, 2021,2022 మూడు సంవత్సరాలు పెద్ద ఎత్తున వర్షాలొచ్చినా అధికంగా నీటిని తీసుకోలేని పరిస్థితి నెలకొంది.అనేక ప్రాజెక్టులకూ సమస్య హంద్రీనీవా ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, అదనంగా వచ్చే నీటి కేటాయింపులను కూడా ప్రభుత్వం చేసింది. శింగనమల, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాల్లోని అనేక చెరువులకు నీటిని అందివ్వాలని నీటి కేటాయింపులు జరిపారు. అయితే కాలువ వెడల్పు పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ఇవి పూర్తయితే తప్ప పైన పేర్కొన్న చెరువులకు నీరు వెళ్లదు. అంతేకాకుండా భైరవానితిప్పకు నీటిని అందించే పనులు జరగాల్సి ఉంది. దీంతోపాటు పేరూరు ఎత్తిపోతల పథకం, పుట్టపర్తి ఎత్తిపోతల పథకం, పిఎబిఆర్‌ కమ్యూనిటీ లిప్టు ఇరిగేషన్‌ స్కీమ్‌ పనులు ముందుకు సాగలేదు. కొత్త ప్రభుత్వమైనా పరుగులు పెట్టించేనా… అభివృద్ధి నినాదంతో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వమైనా ఈ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. వాస్తవానికి 2018 సంవత్సరంలో టిడిపి హయంలోనే బిటిపి, పేరూరు ఎత్తిపోతల పథకాలకు టెండర్లు అయ్యాయి. కొంత వరకు పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఆ తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి రివర్సు టెండరింగు పేరుతో పనులను కొంతకాలం నిలిపివేసింది. ఆ తరువాత భూసేకరణ సమస్య అంటూ పనులు చేపట్టలేదు. ఇప్పటికీ భూసేకరణ పూర్తవలేదు. పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు టిడిపి ఈ పనులను ఏ మేరకు ముందుకు తీసుకెళుతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ ఈ పనులను ముందుకు తీసుకెళుతామని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు మొదలుకుని ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచార సమయంలో హామీలిచ్చారు. ఈ హామీలను ఏ మేరకు అమలు చేయగలుగుతారో చూడాల్సి ఉంది.

➡️