ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2024 ఖరీఫ్ సీజన్ ఆగస్టులో వర్షాభావం నెలకొంది. దీనికి సంబంధించి కరువు మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. అనంతపురం జిల్లాలో ఏడు, సత్యసాయి జిల్లాలో పది మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఈ కరువు పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర కరువు బృందం ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాకు విచ్చేయనుంది. బుధవారం ఉదయం సత్యసాయి జిల్లాలో పర్యటించనుండగా, సాయంత్రం అనంతపురం జిల్లాలో పర్యటించనుంది. కరువు ముగిసినా ఆర్నేళ్ల తర్వాత ఈ బృందం పర్యటిస్తున్న నేపథ్యంలో పంట నష్టం ఏ రకంగా అంచనా వేయనుందన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఆగస్టు తరువాత జిల్లాలో అధిక వర్షాలు పడటంతో పచ్చదనం నెలకొంది. అంతేకాకుండా వేరుశనగ తదితర పంటలను ఇప్పటికే తొలగించారు. ఇప్పుడు ఈ నష్టం కరువు బృందానికి కనిపిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. అనంతపురం జిల్లాలో నార్పల, అనంతపురం, బుక్కరాయసముద్రం. గార్లదిన్నె, యాడికి, విడపనకల్లు, రాప్తాడు మండలంలో కరువు నెలకొంది. ఇందులో 12,856 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని జిల్లా అధికారులు అంచనా వేసి రూ.19.98 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీకి ప్రతిపాదించారు. సత్యసాయి జిల్లాలో తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపుల, కనగానపల్లి, ధర్మవరం, ఎన్పీకుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగి మండలాల్లో కరువు నెలకొంది. ఈ మండలాల్లో 45,848 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. రూ.62.64 ఇన్‌పుట్ సబ్సిడీ అవసరమని ప్రతిపాదించారు.
కరువు కనిపించేనా .?
ఈ ఏడాది ఎప్పుడూలేని విధంగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో జూన్ నుంచి సెప్టంబర్ వరకు చూస్తే ఒక్కో నెల ఒక్కో రకమైన వాతావరణం నెలకొంది. అనంతపురం జిల్లాలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 61 మిల్లీమీటర్లు అయితే 147.7 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. సాధారణం కంటే 142 శాతం అధికంగా వర్షం పడింది. అదే జులై నెలలో చూస్తే సాధారణ వర్షపాతం 63.9 మిల్లీమీటర్లు అయితే 24.4 మిల్లీమీటర్ల మాత్రమే నమో దవగా, -61 శాతం వర్ష పాతం లోటుంది. ఆగస్టు మూడవ వారం వరకు కూడా వర్షాభావ పరిస్థితులే జిల్లాలో నెలకొన్నాయి. ఆ తరువాత మూడవ వారం నుంచి వర్షాలు అధికంగా పడ్డాయి. ఈ నెల మొత్తంగా చూసినప్పుడు సాధారణం కంటే గణనీయంగా వర్షపాతం పడినట్టు కనిపిస్తుంది. ఆగస్టు నెల సాధారణ వర్షఫాతం 83.8 మిల్లీమీటర్లు అయితే 210.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయ్యింది. 210 శాతం అధికంగా వర్షపాతం పడింది. పడిన వర్షపాతం అదును దాటాక రావడంతో జరిగాల్సిన నష్టం అప్పటికే జరిగింది. ఇక సెప్టంబరు సాధారణ వర్షపాతం 110.9 మిల్లీమీటర్లు అయితే 48.4మిల్లీమీటర్లు పడింది. మళ్లీ ఈనెలలో సాధారణంలో 54 శాతమే పడింది. ఇలా వర్షాలు రావడంలో వ్యత్యాసాలు రైతులను నష్టాలపాలుజేశాయి.